Cough Syrups: భారత కంపెనీ దగ్గు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారుల మృతి

  • భారత్ ను అప్రమత్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • దీనిపై మొదలైన దర్యాప్తు 
  • ఆమోదనీయం కాని స్థాయిలో ఇంగ్రేడియంట్స్
India Probes 4 Cough Syrups After WHO Alert On 66 Child Deaths In Gambia

ఘోరం చోటు చేసుకుంది. దగ్గు ఉపశమనానికి వాడిన సిరప్ 66 మంది చిన్నారుల ప్రాణాలను బలిగొంది. గాంబియా అనే ఆఫ్రికన్ దేశంలో ఇది చోటు చేసుకుంది. ఈ దగ్గు ఉపశమన ద్రావకాన్ని (సిరప్) భారత్ లోని హర్యానా రాష్ట్రం సోనేపట్ కు చెందిన మెయిడన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ తయారు చేసినట్టు తేలింది.

దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)ని అప్రమత్తం చేసింది. దీంతో హర్యానా కంపెనీ తయారు చేసిన నాలుగు కాఫ్ సిరప్ లపై దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. డీసీజీఐ వెంటనే ఈ విషయాన్ని హర్యానా రాష్ట్ర ఔషధ మండలి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పాయి. మెయిడన్ ఫార్మాస్యూటికల్ ఈ కాఫ్ సిరప్ లను కేవలం గాంబియాకు మాత్రమే ఎగుమతి చేసినట్టు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు కూడా సరఫరా అయి ఉండొచ్చన్న ఆందోళనను ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యక్తం చేసింది. నాలుగు దగ్గు మందుల వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఏర్పడినట్టు, ఇదే 66 మంది చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. మెయిడన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన ప్రొమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఈ ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. 

‘‘ఈ దగ్గు మందుల్లో ఆమోదనీయం కాని స్థాయిలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నాయి. వీటితో ప్రాణానికి ఎంతో ప్రమాదకరం. వీటివల్ల కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్ర విసర్జన చేయలేకపోవడం, తలనొప్పి, తీవ్రమైన కిడ్నీ గాయాలతో మరణం సంభవించొచ్చు’’అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

More Telugu News