lack of sleep: నిద్రను నిర్లక్ష్యం చేస్తే గుండెకు మహా ముప్పు

Can lack of sleep invite health risks like blood pressure stroke obesity diabetes and heart attack
  • రోజులో కనీసం 6-8 గంటలు నిద్రపోవాలి
  • లేదంటే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం
  • అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు
  • యువతలో పెరిగిపోతున్న ఈ తరహా కేసులు
నిద్ర మన జీవనంలో ముఖ్యమైన భాగం. ఈ సమయంలోనే మన శరీరం తిరిగి పునరుజ్జీవాన్ని సంతరించుకుంటుంది. కళ్లు, కాలేయం తదితర కొన్ని వ్యవస్థలకు విశ్రాంతి లభిస్తుంది. కానీ, నేటి ఆధునిక జీవనంలో నిద్ర తగినంత ఉండడం లేదు. కంటి నిండా (8 గంటలు) నిద్ర లేని వారే ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి కనీసం 6-8 గంటలు నిద్ర అవసరం. అది కూడా నాణ్యమైన నిద్ర అని తెలుసుకోవాలి. 

ఎన్నో సమస్యలు..
నిద్ర తగినంత లేకపోతే ఒత్తిడి పెరిగిపోతుంది. అలసట, నీరసం వస్తాయి. ఏకాగ్రత లోపిస్తుంది. మధుమేహం పలకరిస్తుంది. రక్తపోటుకు దారితీస్తుంది. చివరిగా గుండె చిన్నబోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక స్మార్ట్ ఫోన్ పై గంటల కొద్దీ సమయాన్ని వృధా చేయకుండా సకాలంలో నిద్రకు ఉపక్రమించి, రోజువారీగా 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

భారతీయుల్లో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. నాణ్యమైన నిద్ర కూడా లోపిస్తుంది. దీంతో ఈ రెండింటి మధ్య అనుబంధాన్ని తెలుసుకునేందుకు ఓ అధ్యయనం జరిగింది. దీన్ని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించింది. ‘‘భారత్ యువతలో గుండె జబ్బులు పెరుగుతుండడం ఆందోళనకరం. పెద్ద వారితో పోలిస్తే యువతలోనే గుండె జబ్బులు, వాటి లక్షణాలు మరింత తీవ్రంగా ఉండడం కలవరపరుస్తోంది. దీనివల్ల ఉత్పాదక, జీవనోపాధి తగ్గిపోతుంది. జీవనశైలి గాడి తప్పడం, నిద్రలేమి దీనికి కారణాలు’’అని బెంగళూరులోని కావేరీ హాస్పిటల్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ టీఆర్ పేర్కొన్నారు. 

కీలక సమయం..
నిద్ర లేమికి నేరుగా గుండెతో సంబంధం ఉంటుందని మరో కార్డియాలజిస్ట్ డాక్టర్ అమిత్ భూషణ్ శర్మ సైతం తెలిపారు. ‘‘నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ నిద్రా సమయంలో గుండె రేటు నిదానిస్తుంది. శ్వాస ప్రక్రియ కూడా స్థిరపడుతుంది. రక్తపోటు శాంతించే సమయం కూడా ఇదే. రోజంతా ఎదురయ్యే ఒత్తిడి తట్టుకునేందుకు ఈ సమయంలో జరిగే మార్పులు గుండెకు మేలు చేస్తాయి’’అని వివరించారు. 

6 గంటల కంటే తగ్గితే 
ఆరు గంటల్లోపు నిద్ర పోయే వారికి రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్, హార్ట్ ఎటాక్, ఒబెసిటీ, మధుమేహం రిస్క్ ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజువారీగా కనీసం 6-7 గంటలు అయినా నిద్రించే వారు.. అంతకంటే తక్కువ, ఎక్కువ సమయం నిద్రించే వారితో పోలిస్తే.. గుండె జబ్బులు లేదా స్ట్రోక్ తో మరణించడం చాలా తక్కువ అని అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ అధ్యయనం సైతం చెబుతోంది. 

‘‘బీపీ పెరిగితే అది గుండె వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఎండోథెలియల్ డిస్ ఫంక్షన్ అన్నది నేరుగా హైపర్ టెన్షన్ కు సంబంధించినది. మన శరీరానికి తగినంత విశ్రాంతి (నిద్ర) ఇవ్వకపోతే ఈ హైపర్ టెన్షన్ పెరిగి, కరోనరీ ఆర్టరీ జబ్బుల రూపంలో కనిపిస్తుంది’’అని బెంగళూరు అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిజిత్ కులకర్ణి వివరించారు. 

స్లీప్ ఆప్నియాతో సమస్య
స్లీప్ ఆప్నియా సమస్య ఉన్న వారికి కూడా గుండె జబ్బుల రిస్క్ ఉంటుంది. స్లీప్ ఆప్నియా వల్ల గురక పెడతారు. దీంతో ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఫలితంగా గుండె స్పందనలు గతి తప్పుతాయి. ఇదే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ కు దారితీస్తుంది’’అని ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేశవ ఆర్ తెలిపారు.
lack of sleep
less sleep
danger
heart problems
coronary artery problems
stroke

More Telugu News