Tollywood: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటి హేమ.. రిపోర్టర్‌పై చిర్రుబుర్రు

tollywood actress hema fires on reporter in vijayawada
  • దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న హేమ
  • అమ్మవారి హుండీలో రూ. 10 వేలు వేసి రూ. 20 వేల పట్టుచీర సమర్పించానని వ్యాఖ్య
  • టికెట్ తీసుకున్నారా? అన్న ప్రశ్నకు ఆగ్రహం
  • ప్రొటోకాల్ ప్రకారమే దర్శించుకున్నానన్న నటి
టాలీవుడ్ ప్రముఖ నటి హేమ నిన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు రుసరుసలాడారు. దుర్గమ్మను దర్శించుకోలేకపోతానేమోనని అనుకున్నానని, కానీ అమ్మవారి దర్శనం లభించిందని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జనం రద్దీ ఎక్కువగా ఉందని, ప్రొటోకాల్ ఇబ్బంది కూడా ఉందన్న వార్తలు విన్నానని, కానీ చివరి నిమిషంలో దుర్గమ్మ తనను పిలిచిందని పేర్కొన్నారు. టీవీ లైవ్‌లో చూస్తూ... దుర్గమ్మను స్వయంగా దర్శించుకోలేకపోతున్న భక్తులకు కూడా పుణ్యం దక్కాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా అంతకుముందు ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హేమ కస్సుమన్నారు. మీరు ఎంతమంది వచ్చారు? అందరూ టికెట్ తీసుకున్నారా? అని ఆ విలేకరి ప్రశ్నించాడు. స్పందించిన హేమ ఆ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి హుండీలో తాను రూ. 10 వేలు వేశానని, రూ. 20 వేల విలువైన చీరను సమర్పించానని పేర్కొన్న హేమ.. టికెట్ గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. టికెట్ తీసుకున్నామని, ప్రొటోకాల్ ప్రకారమే దర్శనానికి వెళ్లామని అన్నారు. దీనిని కూడా వివాదం చేస్తారా? అని మండిపడ్డారు. తాను దుర్గమ్మ భక్తురాలినని, తాను అమ్మవారి ఆశీస్సుల కోసమే వచ్చానని, వివాదం సృష్టించేందుకు రాలేదని హేమ పేర్కొన్నారు.
Tollywood
Actress Hema
Vijayawada
Goddess Kanaka Durgamma

More Telugu News