NGT: తెలంగాణకు రూ.3,800 కోట్ల భారీ జరిమానా వడ్డించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్

  • వ్యర్థాల నిర్వహణలో విఫలమయ్యారన్న ఎన్జీటీ
  • మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయడంలేదని అసంతృప్తి
  • రెండు నెలల్లో జరిమానా చెల్లించాలని ఆదేశం
  • కిందటివారం మూడు రాష్ట్రాలపై జరిమానా వడ్డన
National Green Tribunal imposes huge penalty on Telangana govt

వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించకపోవడం, తీర్పులు అమలు చేయకపోవడం వంటి కారణాలతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. 

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ వ్యవహారాల నిర్వహణ సరిగాలేదంటూ 1996లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సురక్ష అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తదనంతర కాలంలో ఎన్జీటీకి బదిలీ చేసింది. 

సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎన్జీటీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు పంపింది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కూడా నోటీసులు పంపగా, ఆయన ఇచ్చిన వివరణ పట్ల ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వేల కోట్ల భారీ జరిమానా విధించింది. రెండు నెలల్లో ఈ జరిమానా మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు, వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని, వాటికి సంబంధించిన పురోగతిని తమకు నివేదించాలని కూడా తన ఆదేశాల్లో పేర్కొంది. 

ఇదే అంశంలో గత కొన్ని వారాల్లో ఎన్జీటీ పలు రాష్ట్రాలకు భారీ జరిమానాలు విధించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాల అమలులో విఫలమయ్యారంటూ మహారాష్ట్రకు రూ.12 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.3,500 కోట్లు, రాజస్థాన్ కు రూ.3 వేల కోట్లు, పంజాబ్ కు రూ.2,080 కోట్ల జరిమానా విధించింది.

More Telugu News