Gehlot: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ కు తలుపులు మూసుకున్నట్టే!

  • తెరపైకి కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్, ఖర్గే, దిగ్విజయ్ సింగ్
  • గెహ్లాట్ పట్ల పార్టీలో సన్నగిల్లిన విశ్వాసం
  • రాహుల్ గాంధీతో చర్చించిన సీనియర్ నేతలు
Cong poll Gehlot out Nath Wasnik Kharge Digvijaya among possible candidates

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రేసు నుంచి తప్పుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అయితే తన వారసుడిగా, తన అనుచరుడినే సీఎం పీఠంలో కూర్చోబెట్టాలన్నది ఆయన ఎత్తుగడ. 

ఈ క్రమంలో తన మద్దతుదారులతో కలసి పార్టీని ఇరకాటంలో పడేశారు. ఒక రకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టారు. సచిన్ పైలట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కానివ్వకూడదన్నది ఆయన వ్యూహం. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనే గెహ్లాట్ కు వ్యతిరేకంగా స్వరాలు వినిపించాయి. 


ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్ష స్థానం విషయంలో గెహ్లాట్ పట్ల పార్టీలో విశ్వాసం సన్నగిల్లినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జోడో యాత్రలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీతో పార్టీ సీనియర్ నేతలు ప్రత్యామ్నాయ అభ్యర్థిత్వాలపై చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ చీఫ్ కు నామినేషన్ల దాఖలుకు మరో నాలుగు రోజులే ఉంది. 

కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ పేర్లు తాజాగా వినిపిస్తున్నాయి. అయితే, తనకు కాంగ్రెస్ అధ్యక్ష స్థానం పట్ల ఆసక్తి లేదని కమల్ నాథ్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తన మద్దతుదారులతో గెహ్లాట్ సాగించిన రాజకీయ హైడ్రామా తర్వాత ఆయన అభ్యర్థిత్వం పట్ల పార్టీలో నమ్మకం పోయినట్టు సమాచారం. ఈ క్రమంలో కొత్త అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News