TANA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ‘తానా’ బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కుమార్తెల దుర్మరణం

ANA Director Dr Nagendra Srinivas Kodali Family Killed In Road Accident In America
  • కుమార్తెను కాలేజీ నుంచి తీసుకొస్తుండగా ప్రమాదం
  • వెనక నుంచి వచ్చి ఢీకొట్టిన వ్యాను
  • ఇద్దరు అక్కడికక్కడే మృతి.. ఒకరు ఆసుపత్రిలో మృతి 
  • శ్రీనివాస్‌ది కృష్ణా జిల్లాలోని కురుమద్దాలి
  • భార్య, పిల్లలను కోల్పోవడంతో షాక్‌లోకి వెళ్లిపోయిన శ్రీనివాస్
అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. అనంతరం పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేస్తూ హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. 2017 నుంచి ‘తానా’ బోర్డులో పనిచేస్తున్నారు.

శ్రీనివాస్ భార్య వాణి ఆదివారం ఉదయం 11.30 గంటలకు కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ వాలర్ కౌంటీలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాణి ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది. రెండో అమ్మాయి 11వ తరగతి చదువుతోంది. ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన శ్రీనివాస్ షాక్‌లోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన తానా సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
TANA
Dr Nagendra Srinivas Kodali

More Telugu News