Iran: హిజాబ్ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్.. 31 మంది మృత్యువాత

  • ఇరాన్‌లో చిచ్చు రేపిన హిజాబ్
  • దేశవ్యాప్తంగా పాకిన నిరసనలు
  • హిజాబ్‌లను రోడ్డుపై వేసి తగలబెట్టిన మహిళలు
  • ఆందోళనల అదుపునకు కాల్పులు
woman detained by the morality police fuelled protests in Iran died 31

హిజాబ్ రేపిన చిచ్చుతో ఇరాన్ ఘర్షణలతో అట్టుడుకుతోంది. రక్తసిక్తంగా మారుతోంది. నిరసనకారులకు, బలగాలకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. గతవారం ఓ ప్రావిన్సులో మొదలైన ఘర్షణలు దేశమంతా విస్తరించాయి. ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు  31 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలువురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఎందుకీ ఘర్షణలు?
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో మాసా అమీని అనే 22 ఏళ్ల యువతిని నైతిక విభాగం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వారి కస్టడీలో తీవ్రంగా గాయపడిన యువతి ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలిసిన ఆమె సొంత ప్రావిన్స్ కుర్దిస్థాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. ఆ తర్వాత అవి క్రమంగా దేశమంతా విస్తరించాయి.

నడి వీధిలో హిజాబ్‌లు బుగ్గి
హిజాబ్‌ ధారణకు వ్యతిరేకంగా మొదలైన అల్లర్లు రోజురోజుకు తీవ్రరూపం సంతరించుకుంటున్నాయి. మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని టెహ్రాన్ సహా 30 నగరాల్లో నిన్న రోడ్డుపైకొచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హిజాబ్‌లను తొలగించి నడిరోడ్డుపై తగలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. బాష్పవాయువు, వాటర్ కేనన్లను ప్రయోగించారు. ఇంకొన్ని చోట్ల కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో బలగాలు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక్క కుర్దిస్థాన్‌లోనే 15 మంది బలయ్యారు. మజందరన్ ప్రావిన్సులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News