Supreme Court: విద్వేష ప్రసంగాలు ఒక మనిషిని హత్య చేయడం లాంటివే: సుప్రీంకోర్టు

Supreme Court  opines on hate speeches
  • మీడియాలో విద్వేష ప్రసంగాలు
  • గతేడాది సుప్రీంలో దాఖలైన పిటిషన్లు
  • విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం
  • ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుగీత గీయాలని పిలుపు
మీడియాలో విద్వేష ప్రసంగాలకు సంబంధించి గతేడాది దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. టీవీ చానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలు వస్తున్నప్పుడు అవి కొనసాగకుండా చూడడంలో యాంకర్ ప్రాత ఎంతో ముఖ్యమైనదని అభిప్రాయపడింది. 

"ప్రధాన మీడియా స్రవంతిలోనూ, సోషల్ మీడియాలోనూ ఇలాంటి ప్రసంగాలపై నియంత్రణ ఉండడంలేదు. ఇలాంటి వేళ, ఎవరైనా టీవీలో విద్వేష ప్రసంగం చేస్తుంటే అడ్డుకోవడం యాంకర్ తన కర్తవ్యంగా భావించాలి. మీడియా స్వేచ్ఛ చాలా ముఖ్యం. అమెరికా తరహాలో మనది స్వేచ్ఛాయుత సమాజం కాకపోవచ్చు కానీ, దీనికి ఎక్కడ అడ్డుకట్ట వేయాలో తెలుసుకోవాలి. ఈ ద్వేషపూరిత ప్రసంగాలు అనేవి ఒక మనిషిని హత్య చేయడం లాంటివే. దీనికి అనేక దశలు ఉన్నాయి. నిదానంగా అయినా, ఇతర మార్గాల్లో అయినా విద్వేషాన్ని వెళ్లగక్కేందుకు అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రబలమైన అంశాలతో మనల్ని కట్టిపడేస్తుంటాయి" అంటూ కేఎం జోసెఫ్ ధర్మాసనం తన అభిప్రాయాలు వెలిబుచ్చింది. 

ఇలాంటి వాటిపై ప్రభుత్వం ఎందుకు మూగసాక్షిగా ఉంటుందో అర్థంకాదు అని వ్యాఖ్యానించింది. 'ఈ నేపథ్యంలో, ప్రభుత్వం విరుద్ధ పోకడలకు పోకుండా కోర్టులకు సహకరించాల్సి ఉంటుంది... ఎందుకంటే ఇదేమీ చిన్న విషయం కాదు కదా!' అని పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణను నవంబరు 23కి వాయిదా వేసింది.
Supreme Court
Hate Speeches
Media
Anchor
India

More Telugu News