Chhello Show: భారత్ నుంచి ఆస్కార్ కు గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'... 'ఆర్ఆర్ఆర్'కు తీవ్ర నిరాశ

Gujarathi film Chhello Show got official entry for Oscars from India
  • ఆస్కార్ కు భారత్ అధికారిక ఎంట్రీ ఖరారు
  • అనూహ్య రీతిలో అవకాశం దక్కించుకున్న ఛెల్లో షో
  • పన్ నళిన్ దర్శకత్వంలో చిత్రం
  • జ్యూరీలో చర్చకు వచ్చిన ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్
వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీ ఖాయమైంది. భారత్ నుంచి ఈసారి గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో' (ఆఖరాట) ఆస్కార్ కు వెళుతోంది. ద కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తోసిరాజని 'ఛెల్లో షో' ఆస్కార్ చాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రం ఆస్కార్ లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పోటీపడనుంది. గుజరాతీ దర్శకుడు పన్ నళిన్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఛెల్లో షో' చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'లాస్ట్ ఫిల్మ్ షో' పేరిట ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ప్రదర్శితమైంది. 

తమ చిత్రం ఆస్కార్ కు వెళుతుండడం పట్ల దర్శకుడు పన్ "ఓ మై గాడ్" అంటూ సంతోషం వ్యక్తం చేశారు. పన్ నళిన్ ఇదివరకు సంసార, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 

కాగా, భారత్ నుంచి ఆస్కార్ కు వెళ్లే చిత్రం ఎంపికపై జ్యూరీలో పెద్ద చర్చే నడిచింది. కొన్ని మలయాళ చిత్రాలు, తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు వెళ్లడం ఖాయమని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి అంచనాల్లేని ఛెల్లో షో చిత్రం ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Chhello Show
Official Entry
Oscar
Gujarati Film
India

More Telugu News