అత్యాచారం నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసిన అధికారులు ..ఎక్కడంటే..!
- మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో ఘటన
- శనివారం టీనేజ్ బాలికపై ఆరుగురి అత్యాచారం
- ముగ్గురు నిందితుల అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
పోలీసుల వివరాల ప్రకారం, శనివారం మధ్యాహ్నం నైగర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశతభుజి మాత దేవాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది. టీనేజ్ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి వాకింగ్‌కు వెళ్లి ఆలయాన్ని సందర్శించింది. దర్శనానంతరం ఇద్దరూ గుడి దగ్గర కూర్చుని మాట్లాడుతుండగా ఆరుగురు నిందితులు వారి వద్దకు వచ్చారు. నిందితులు బాలికను ఆలయం సమీపంలోని జలపాతం వద్దకు ఈడ్చుకెళ్లి స్నేహితుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం నిందితులు ఆమెను కొట్టి, మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు బాలికను, ఆమె స్నేహితుడిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.
బాలిక, ఆమె స్నేహితుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై నైగఢి పోలీసులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు రేవా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) అనిల్ సోంకర్ తెలిపారు. ఇంతలో, అరెస్టయిన ముగ్గురు అనుమానితుల ఇళ్లపై స్థానిక అధికారులు బుల్డోజర్లు తీసుకెళ్లారు. మిగిలిన ముగ్గురు నిందితులు దొరకగానే వారి ఇళ్లపై కూడా చర్యలు తీసుకుంటామని సోంకర్ చెప్పారు