Ambika Singh Deo: మా వాళ్లు సరదా కోసం ఆ చీతాలను చంపలేదు: రాజా రామానుజ ప్రతాప్ సింగ్ దేవ్ మనవరాలు అంబిక స్పష్టీకరణ

  • 70 ఏళ్ల కిందట భారత్ లో చీతాలు అంతర్ధానం
  • సోషల్ మీడియాలో రాజా రామానుజ సింగ్ ఫొటో వైరల్
  • 1947లో మూడు చీతాల వేట
  • ఆయన వల్లే చీతాలు అంతరించాయంటూ విమర్శలు
Raja Ramanuja Pratap Singh Deo granddaughter Ambkika opines on Cheetahs killing in past

నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ లోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్ లో విడుదల చేశారు. దాదాపు 70 ఏళ్ల క్రితం భారత్ లో అంతరించిపోయిన చీతాలు ఇన్నాళ్లకు భారత గడ్డపై మళ్లీ అడుగుపెట్టాయి. 

కాగా, అప్పట్లో చివరిగా మిగిలిన మూడు ఆసియా చీతాలను 1947లో అప్పటి కొరియ (చత్తీస్ గఢ్ లోని ఓ ప్రాంతం) రాజు రాజా రామానుజ ప్రతాప్ సింగ్ దేవ్ వేటాడారు. ఆ మూడు చీతాల కళేబరాల వద్ద ఆయన తుపాకీ పట్టుకుని నిలుచున్న ఫొటో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. 

దీనిపై రాజా రామానుజ ప్రతాప్ సింగ్ దేవ్ మనవరాలు అంబికా సింగ్ దేవ్ స్పందించారు. తమ పూర్వీకులు జంతువులను సరదా కోసం ఎప్పుడూ చంపలేదని స్పష్టం చేశారు. 1940లో తమ తాత గారు రాజ్యానికి దూరంగా వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో రక్తం రుచి మరిగిన పులి ఒకటి ఓ గ్రామంపై పడి భయాందోళనలకు గురిచేస్తోందని తాను విన్న గాథల ప్రకారం అంబిక వెల్లడించారు. 

అయితే, అప్పటికి తన తండ్రి మహేంద్ర ప్రతాప్ సింగ్ కు కేవలం 12 ఏళ్లని, అయినప్పటికీ ధైర్యసాహసాలు ప్రదర్శించి, ఆ క్రూరమృగాన్ని హతమార్చాడని వివరించారు. కానీ, వేట గురించి మీడియాలోనూ, సినిమాల్లోనూ వక్రీకరిస్తుంటారని విమర్శించారు. 

వేట అన్నివేళలా సరదా కోసం కాదని, తమ రాజ కుటుంబం కేవలం మనుషుల్ని తినే క్రూర మృగాలనే వేటాడిందని అంబికా సింగ్ దేవ్ స్పష్టం చేశారు. 

చాలాసార్లు గ్రామస్తులు మనిషి మాంసం రుచిమరిగిన జంతువుల నుంచి తమను కాపాడాలని వస్తే, ఆ జంతువులను హతమార్చడం తప్పేమీ కాదని అన్నారు. చీతాలు భారత్ లో అంతర్ధానమైపోవడానికి కారణం తమ రాజకుటుంబమే అని వస్తున్న విమర్శల్లో అర్థం లేదని ఆమె పేర్కొన్నారు. 1947 తర్వాత కూడా కొన్ని చీతాలు భారత్ లో కనిపించాయని అన్నారు. 

రాజా రామానుజ ప్రతాప్ సింగ్ దేవ్ 1958లో మరణించగా, 1968లో అంబికా సింగ్ దేవ్ జన్మించారు. ఆమె ప్రస్తుతం చత్తీస్ గఢ్ లో బైకుంఠపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

More Telugu News