Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: రెండో రోజున విద్యుత్ అంశంపై రఘునందన్ రావు వర్సెస్ సీఎం కేసీఆర్

  • మోటార్లకు మీటర్లు పెట్టాలని బిల్లులో లేదన్న రఘునందన్
  • కేంద్రంలో పేదల ప్రభుత్వం ఉందని వెల్లడి
  • విద్యుత్ సంస్కరణల ముసుగులో దోపిడీ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు
Telangana assembly sessions start

వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలన్నది సవరించిన బిల్లుల్లో ఎక్కడా లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కాగా, సభలో విద్యుత్ అంశం చర్చకు వచ్చింది. 

బీజేపీ సభ్యుడు రఘునందన్ రావు మాట్లాడుతూ, 2020లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన సవరించిన విద్యుత్ బిల్లులో.... రాష్ట్రం ప్రభుత్వం పలు కేటగిరీల వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలను రద్దు చేయాలని కేంద్రం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. మేం సబ్సిడీలు ఇస్తుంటే కేంద్రం తొలగించమంటోంది అంటూ వాదనల్లో నిజంలేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. 

అంత్యోదయ అనే సిద్ధాంతంపైనే పుట్టిన బీజేపీ పేదలకు అన్యాయం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించదని అన్నారు. వ్యవసాయానికి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని బీజేపీ ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. 

అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. అభివృద్ధిని అంచనా వేసేందుకు అనేక కొలమానాలు ఉంటాయని తెలిపారు. ఏ దేశం ఎంత విద్యుత్ వాడుతుందనేది ప్రధాన సూచిక అని వివరించారు. విద్యుత్ చట్టంపై కేంద్రం పెత్తనం ఏంటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మాట మాత్రం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేశారని ఆరోపించారు. లోక్ సభలో కూడా మాట్లాడే పరిస్థితి లేదని, తిరిగి విపక్షాలపైనే దాడులు చేసే పరిస్థితి ఉందని అన్నారు. 

ఎంత హార్స్ పవర్ ఉన్న మోటార్లు పెట్టారన్న దానితో పనిలేకుండా తెలంగాణ రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇచ్చామన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల ముసుగులో రైతులను దోచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ఏపీలోని శ్రీకాకుళంలో కేంద్రం విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టిందని తెలిపారు. దాంతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ధర్నా చేపట్టారని కేసీఆర్ వివరించారు.

More Telugu News