BJP: ఉక్కు శాఖ మంత్రితో జీవీఎల్ భేటీ... విశాఖ ఉక్కు వ‌ర్కింగ్ కేపిట‌ల్‌ స‌మ‌స్యపై చ‌ర్చ‌

bjp mp gvl narasimharao meets union minister jyotiradithya scindia over vizag steel plant issue
  • వ‌ర్కింగ్ కేపిట‌ల్‌తో విశాఖ ఉక్కు స‌త‌మ‌త‌మ‌వుతోంద‌న్న జీవీఎల్‌
  • స‌మ‌స్య ప‌రిష్కారం కావాలంటే కేంద్రం జోక్యం అవ‌స‌ర‌మ‌ని విన‌తి
  • ముడి స‌రుకును ముంద‌స్తుగా స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్న కేంద్ర మంత్రి
ఏపీకి చెందిన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు గురువారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియాతో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కీల‌క‌మైన వ‌ర్కింగ్ కేపిట‌ల్‌ అంశంపై ఆయ‌న కేంద్ర మంత్రితో చ‌ర్చించారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఆయ‌న కేంద్ర మంత్రికి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని సింథియా అక్క‌డిక‌క్క‌డే జీవీఎల్‌కు హామీ ఇచ్చారు. 

విశాఖ ఉక్కు క‌ర్మాగారం వర్కింగ్ క్యాపిటల్ సమస్యతో స‌త‌మ‌తం అవుతోంద‌ని ఈ సంద‌ర్భంగా జీవీఎల్ తెలిపారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటే కేంద్ర‌ మంత్రిత్వ శాఖ జోక్యం త‌ప్ప‌నిస‌రి అని ఆయ‌న తెలిపారు. గ‌తేడాది రూ.913 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రస్తుత సంవత్సరంలో వర్కింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోవడం, అధిక ముడిసరుకు ధర మరియు ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని జీవీఎల్ పేర్కొన్నారు. బలమైన, శక్తిమంతమైన, లాభదాయకమైన విశాఖ ఉక్కు... ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం వంటిదని పేర్కొన్న జీవీఎల్, స్టీల్ ప్లాంట్ యొక్క సమర్థవంతమైన మరియు విజయవంతమైన నిర్వహణకు జాతీయ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 

ఉక్కుశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో తను భేటీపై సంతృప్తి వ్యక్తం చేసిన జీవీఎల్‌.. వర్కింగ్ క్యాపిటల్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ముడిసరుకును మంత్రిత్వ శాఖ ముందస్తుగా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చిన‌ట్లు తెలిపారు. విశాఖ ఉక్కు తన సామర్థ్య వినియోగాన్ని పెంచుకునేందుకు ఈ వెసులుబాటు సహాయ పడుతుందని మంత్రి అభిప్రాయప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు.
BJP
Andhra Pradesh
Vizag Steel Plant
GVL Narasimha Rao
Jyotiraditya M. Scindia

More Telugu News