Exersice: రోజూ రెండు పూటలా వ్యాయామాలు చేయవచ్చా?.. దానివల్ల లాభాలు, నష్టాలపై నిపుణుల సూచనలివీ

  • రోజూ రెండు సార్లు వ్యాయామాలు చేయడం వల్ల లాభాలు ఎన్నో..
  • రెండు పూటలా తీవ్ర స్థాయిలో ఉండవద్దని స్పష్టం చేస్తున్న నిపుణులు
  • వ్యాయామాలను విడదీసుకుని చేయాలని సూచన
  • శారీరక ఆరోగ్యాన్ని బట్టి సమయం, వ్యాయామాల తీవ్రత ఉండాలని స్పష్టీకరణ
Should you work out twice a day

శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నది అందరికీ తెలిసిందే. కొంత మంది రోజూ పొద్దున, సాయంత్రం కూడా వ్యాయామాలు చేస్తుంటారు. రెండు పూటల జిమ్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నవారూ ఉంటారు. సాధారణ వ్యాయామాలు సరేగానీ.. రోజూ రెండు పూటలా తీవ్ర స్థాయిలో వ్యాయామాలు చేయడం మంచిదేనా, దాని వల్ల ఉండే ప్రయోజనాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, ఎలాంటి వ్యాయామాలు చేయాలన్న సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతుంటాయి. దీనికి సంబంధించి వ్యాయామ, పోషకాహార నిపుణులు చేస్తున్న సూచనలివీ..

రెండు సార్లు వ్యాయామం చేయడం వల్ల లాభాలు
మనం ఎంతగా వ్యాయామం చేస్తే.. దాని నుంచి శరీరానికి అంతగా ఫలితాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత జబ్బులు, కేన్సర్, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉపకరిస్తుందని.. ఒత్తిడి, డిప్రెషన్, అల్జీమర్స్ ప్రమాదం కూడా తగ్గుతాయని వివరిస్తున్నారు. రోజూ రెండుసార్లు వ్యాయామం చేయడం వల్ల ఈ ప్రయోజనాలు సమకూరుతాయని.. అయితే ఒక నిర్ణీత పరిమితి వరకే ఇది బాగుంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే క్రీడాకారులు, కొన్నిరకాల క్రీడలు ప్రాక్టీస్ చేసేవారు మాత్రం తగిన ఆహారం తీసుకుని రోజూ రెండు సార్లు కఠిన వ్యాయామాలు చేయడం తప్పనిసరి అని వివరిస్తున్నారు.

రెండు సార్లు వ్యాయామం వల్ల నష్టాలు
వ్యాయామాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. రెండు సార్లు చేయడం శరీరంపై ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరీ అతిగా వ్యాయామాలు చేయడం వల్ల ‘ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ (కండరాలు కరిగిపోవడం)’, కండరాలు, కీళ్లు వంటివి దెబ్బతినడం తదితర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అతి వ్యాయామం వల్ల.. శరీరంపై ఒత్తిడి పెరిగి కార్టిసాల్ హార్మోన్, ఆకలికి కారణమైన ఘ్రెలిన్ హార్మోన్ ల ఉత్పత్తి పెరుగుతుందని.. దీనివల్ల ఎక్కువగా తినడం, బరువు పెరగడం జరుగుతుందని చెబుతున్నారు.

  • సాయంత్రం సమయాల్లో ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల.. నిద్ర సమయం, నిద్ర నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.
  • అంతేగాకుండా రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఒకే రకమైన వ్యాయామాలు చేయడం వల్ల శరీరానికి అదనంగా సమకూరే ప్రయోజనం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
  • అందువల్ల ఉదయం, సాయంత్రం చేసే వ్యాయామాల్లో వేర్వేరుగా (అంటే కార్డియో, స్ట్రెంత్ వ్యాయామాలుగా గానీ... శరీరంలో పైభాగానికి, దిగువభాగానికి చెందినవిగా గానీ) విడదీసుకుని చేయడం వల్ల ఫలితం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

రెండింటిలో ఒకదాని తీవ్రత తగ్గించుకోవాలి
ఉదయం, సాయంత్రం రెండు సార్లు వ్యాయామం చేయాలనుకునేవారు.. రెండింటిలో ఏదో ఒక సమయంలో చేసే వ్యాయామం తీవ్రతను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీరు వ్యాయామం కోసం పెట్టుకునే లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఉదయం పూట తీవ్ర స్థాయి వ్యాయామాలు, సాయంత్రం తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. అయితే క్రీడాకారులు, ప్రత్యేకమైన లక్ష్యం పెట్టుకుని వ్యాయామం చేసేవారు మాత్రం.. నిపుణుల సలహా మేరకు వ్యాయామాలను విడదీసుకోవాలని చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎవరైనా వ్యాయామం చేయదలచుకున్నప్పుడు.. వారి ఆరోగ్య పరిస్థితి, శరీర తత్వాన్ని బట్టి ముందుకు వెళ్లాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుండె జబ్బులు, కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు.. వైద్యుల సలహాను తీసుకున్నాకే వ్యాయామాలు చేయాలని వివరిస్తున్నారు. వ్యాయామం చేసినప్పుడు తగిన పోషకాహారం అందేలా జాగ్రత్త తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News