Cancer: చిన్న వయసులోనే కేన్సర్ ముప్పు.. కారకాలు ఇవే..!

Cancer more likely to affect younger people now These are potential causes
  • గతంతో పోలిస్తే యువతలో ఎక్కువగా కేన్సర్ కేసులు
  • ప్రాసెస్డ్ ఫుడ్స్, నిద్రలేమి, మద్యపానంతో పెరిగిన ముప్పు
  • తీసుకునే ఆహారంతో కడుపులో దెబ్బతింటున్న సూక్ష్మజీవుల కూర్పు
నేటి రోజుల్లో యువతరానికి కేన్సర్ ముప్పు పెరిగిపోయింది. ప్రతి ఇంటికీ ఓ కేన్సర్ కేసు మాదిరిగా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. 50 ఏళ్లలోపు వ్యక్తులకు కేన్సర్ కేసులు 1990 తర్వాత గణనీయంగా పెరిగిపోయినట్టు బ్రింగమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్స్ పరిశోధకులు గుర్తించారు. కిడ్నీ, లివర్, పాంక్రియాటిక్, బ్రెస్ట్, కొలన్, ఈసోఫాజియల్ కేన్సర్ల కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది. నేచర్ రివ్యూస్ క్లినికల్ అంకాలజీ పత్రికలో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

కారణాలు..
మద్యపాన సేవనం, నిద్రలేమి, పొగతాగడం, స్థూలకాయం, అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం కేన్సర్ ముందస్తు రిస్క్ పెరగడానికి కారణమవుతున్నట్టు ఈ అధ్యయనం ప్రకటించింది. ముఖ్యంగా కొన్నిదశాబ్దాల క్రితంతో పోలిస్తే యువత చాలా తక్కువ సమయం పాటు నిద్రపోతున్నట్టు పేర్కొంది. పెద్ద వారి నిద్ర సమయాల్లో ఏమంత మార్పు లేదని తెలిపింది. అంటే నేటి యువత ఎక్కువగా సంపాదన, వినోద వ్యాపకాలకు సమయం అంతా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

పోషకాహారం, జీవన విధానం, బరువు నియంత్రణ ఇవన్నీ కూడా కేన్సర్ పై ప్రభావం చూపిస్తున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. 2000 తర్వాత మన దేశంలో ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతూ వెళుతున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అధికంగా ప్రాసెస్ చేసిన పదార్థాలు, చక్కెరలు, ఉప్పు అధికంగా ఉన్న పదార్థాలను తినడం ఎక్కువైపోయింది. ఫలితంగా మధుమేహం, రక్తపోటు కేసులు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే పెద్ద సంఖ్యలో ఎందుకు కేన్సర్ బారిన పడుతున్నారు? అన్న విషయాన్ని తెలుసుకునేందుకే పరిశోధకులు ప్రధానంగా దృష్టి సారించినప్పుడు ఈ విషయాలన్నీ తెలిశాయి.

ముందస్తు కేన్సర్ స్క్రీనింగ్ అవసరాన్ని ఈ అధ్యయనం గుర్తు చేసింది. అలా అయితేనే కేన్సర్ ను తొలినాళ్లలో గుర్తించడం సాధ్యపడుతుందని, తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. పరిశోధకులు కేసులు ఎక్కువగా వస్తున్న 14 కేన్సర్ రకాలపై అధ్యయనం చేయగా, ఇందులో ఎనిమిది జీర్ణాశయ సంబంధితమైనవే ఉన్నాయి. తీసుకునే ఆహారం పేగుల్లోని సూక్ష్మజీవుల కూర్పును దెబ్బతీస్తోందని.. ఈ విధమైన మార్పులు కేన్సర్ రిస్క్ ను పెంచుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు.
Cancer
younger people
affect
processed foods
alcohol

More Telugu News