Talakondapalle: చనిపోయిన గర్భిణికి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల చికిత్స.. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

Doctors continue treatment to a deceased Pregnant in Amangal
  • శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలోనే మరణించిన గర్భిణి
  • మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు నమ్మించి వైద్యం
  • చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి మెరుగుపడుతోందన్న వైద్యులు
  • ఆ తర్వాత కాసేపటికే మరణించినట్టు చెప్పిన వైనం
  • బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో రూ. 8 లక్షలు ఇస్తామంటూ ఒప్పందం
మెగాస్టార్ నటించిన ‘ఠాగూర్’ సినిమా అప్పట్లో ఎంత సంచలనమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైద్యం పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులు జనాన్ని ఎలా దోచుకుంటున్నాయో ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు. చనిపోయిన వ్యక్తికి చికిత్స ఇస్తున్నట్టు నమ్మిస్తూ లక్షలకు లక్షలు కట్టించుకుంటారు. ఇది సినిమా కథ. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటిదే రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తలకొండపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ నెలలు నిండడంతో ప్రసవం కోసం ఆమనగల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది.

శస్త్రచికిత్స ద్వారా ఆదివారం సాయంత్రం ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర అస్వస్థతతో మరణించింది. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టిన వైద్యులు.. ఆమెకు మరింత మెరుగైన చికిత్స అందించాల్సి ఉందంటూ అదే రోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. అక్కడామెకు వైద్యం అందిస్తున్నట్టు చెబుతూ కోలుకుంటోందని బంధువులను నమ్మించారు. 

ఆ తర్వాత కాసేపటికే తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. అనుమానం వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఆమనగల్లు ఆసుపత్రి యాజమాన్యం దిగొచ్చింది. గొడవ మరింత పెద్దదై బయటకు రాకుండా కప్పిపుచ్చేందుకు బాధిత కుటుంబ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 8 లక్షలు ఇస్తామని ఒప్పందం పత్రం రాసి ఇచ్చినట్టు తెలుస్తోంది.
Talakondapalle
Amangal
Hospital
Tagore Movie

More Telugu News