Ayurvedam: ఏయే రకాల ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు?.. ఆయుర్వేద నిపుణులు చేస్తున్న పది సూచనలు ఇవిగో

  • మన శరీరంలో నుంచి వాత, పిత్త, కఫ దోషాలను తొలగించే లక్షణాలు ఆహారంలో ఉంటాయని వెల్లడి
  • పరస్పర విరుద్ధ లక్షణాలున్న ఆహారం తీసుకుంటే సమస్యలు వస్తాయని వివరణ
  • ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిక
Ten food combinations that are best avoided

మనకు శరీరక, మానసిక ఆరోగ్యాలు సమకూరాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు. దీనివరకు బాగానే ఉన్నా.. మనం నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ దోషాలకు అనుగుణంగా ఆహారానికి లక్షణాలు ఉంటాయని.. అందువల్ల కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకోవద్దని అంటున్నారు. ఒకవేళ అలా తీసుకుంటే.. శరీరంలో పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. ఏయే ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదో ఆయుర్వేద నిపుణులు చెబుతున్న వివరాలివీ..

1. చేపలు, పాలు
ఆయుర్వేద సూత్రాల ప్రకారం .. ఈ రెండు ఆహారాలు తీపి కేటగిరీలోకి వచ్చినా, వాటి లక్షణాలు మాత్రం పరస్పర విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. చేపలు వేడి చేస్తాయని, పాలు చలువ అని.. అందువల్ల కలిపి తీసుకోకూడదని వివరిస్తున్నారు.

2. పాలు, తులసి
ఈ రెండూ శరీరానికి మేలు చేసేవే అయినా.. కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తీసుకోదలచుకుంటే.. కనీసం అర గంట విరామం ఉండాలని అంటున్నారు.

3. పాలు, పుల్లటి పండ్లు
పులుపు ఉండే పళ్లను, పాలను కలిపి తీసుకోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు అరటి పండ్లను కూడా పాలతో కలిపి తీసుకోవద్దని అంటున్నారు. నిజానికి బనానా మిల్క్ షేక్ వంటివి బాగా ఫేమస్ అయినా.. అలాంటివి మంచివి కావదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

4. ఆలుగడ్డలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్, గుడ్లు వంటి ఆహారం
ఆలుగడ్డలలో పిండి పదార్థాలు (స్టార్చ్) ఎక్కువ. ఇలా స్టార్చ్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న చికెన్, గుడ్లు వంటి ఆహారంతో కలిపి తీసుకోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ఆహారం జీర్ణం కావడానికి ఇబ్బంది ఎదురవుతుందని అంటున్నారు.

5. దోసకాయ, టమాటా
దోసకాయ, టమాటా రెండింటి లక్షణాలు విరుద్ధంగా ఉంటాయని.. వాటిని కలిపి తీసుకోవద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వీటికి పెరుగు, నిమ్మకాయ వంటివీ జత చేయవద్దని అంటున్నారు. పెరుగు రైతాలో దోస, టమాటా వేసుకోవడం.. సలాడ్లపై నిమ్మరసం పిండటం సరికాదని పేర్కొంటున్నారు.

6. వేడి పదార్థాలు, తేనె
తేనెను వేడి చేసినప్పుడు అందులోని పోషకాలు నశిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వేడి పదార్థాలు, వేడి చేసే పదార్థాలతో తేనెను కలిపి తీసుకోవద్దని అంటున్నారు. అలా తీసుకుంటే శరీరంలో వేడిని పెంచి అనారోగ్యాలకు కారణమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

7. తృణ ధాన్యాలు, పండ్లు
వివిధ రకాల తృణ ధాన్యాలు, పండ్లను ఒకేసారి కలిపి తీసుకోవడం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దానివల్ల ఆహారం జీర్ణంకావడం కష్టమని, వివిధ దోషాలు తలెత్తే అవకాశమూ ఉంటుందని అంటున్నారు.

8. పాలకూర, నువ్వులు
పాలకూర, నువ్వులు కలిపి తిన్నప్పుడు శరీరంలో వేడి పెరుగుతుందని.. దీనివల్ల విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని కలిపి తీసుకోవద్దని అంటున్నారు.

9. బెల్లం, పెరుగు
బెల్లం, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని.. జలుబు, దగ్గు వంటివి వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు వీటి మధ్య విరామం ఉండేలా చూడాలని అంటున్నారు.

10. నెయ్యి, తేనె
తేనె, నెయ్యి రెండింటినీ కలిపి తీసుకోవడంలో కొంత పద్ధతి పాటించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తేనె రెండు వంతులు, నెయ్యి ఒక వంతు ఉండేలా చూసుకోవాలని.. సమానంగా మాత్రం ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వేరే పదార్థాలను కలిపినప్పుడు రెండింటి మిశ్రమం ఎంతగా ఉన్నా ఫరవాలేదని అంటున్నారు.

ఆయుర్వేదాన్ని అనుసరించే వారికే..
ఈ సూచనలన్నీ ఆయుర్వేదాన్ని నమ్మి, అనుసరించే వారికేనని.. వీటిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ రకాల ఆహార పదార్థాలను.. వేర్వేరు స్థాయిలో కలిపి తీసుకోవడం అలవాటుగా మారినందువల్ల.. ఫలితాలు వేర్వేరుగా ఉండవచ్చని అంటున్నారు. శరీరంలో ఏవైనా అనారోగ్యాలు ఏర్పడినప్పుడు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

More Telugu News