Maharashtra: పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చి గుండెపోటుకు గురైన వ్యక్తి.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన వైద్యుడు.. వీడియో వైరల్

Doctor performs CPR on patient as he suffers heart attack in the clinic
  • వైద్యుడి ఎదురుగా కుర్చీలో కూర్చున్న రోగి
  • గుండెపోటుతో తల వెనక్కి వాల్చేసిన వైనం
  • గుండెపై నిదానంగా తడుతూ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యుడు
  • రియల్ హీరోలు మన మధ్యే ఉంటారన్న రాజ్యసభ సభ్యుడు ధనంజయ్ మహాదిక్
పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగి ఉన్నట్టుండి కుర్చీలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అది చూసిన వైద్యుడు క్షణ కాలంలోనే స్పందించి అతడి ప్రాణాలు కాపాడాడు. మహారాష్ట్రలో జరిగిందీ ఘటన. కొల్హాపూర్‌కు చెందిన అర్జున్ అద్నాయక్ కార్డియాలజీ స్పెషలిస్ట్. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి జనరల్ చెకప్ కోసం నిత్యం ఆయన వద్దకు వస్తుండేవాడు. 

పుష్కరకాలం క్రితం అమర్చిన పేస్‌మేకర్‌ను మార్చుకోవాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం మరోమారు ఆయన డాక్టర్ అర్జున్‌ను కలిశారు. వైద్యుడు మరో రోగిని చూస్తుండడంతో కేబిన్‌లోని ఆయన ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో కొంత అసౌకర్యంగా కదిలిన ఆయన మరుక్షణంలోనే తల వెనక్కి వాల్చేశాడు. 

అది చూసిన డాక్టర్ అర్జున్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆయన వద్దకు వెళ్లి సీపీఆర్ చేశారు. గుండెపై నిదానంగా తట్టారు. దీంతో రోగిలో మళ్లీ చలనం వచ్చి మామూలు స్థితికి చేరుకున్నాడు. వైద్యుడి కేబిన్‌లో అమర్చిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాకెక్కిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు డాక్టర్ అర్జున్ అద్నాయక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. క్షణాల్లో ఆయన స్పందించి సీపీఆర్ చేసి రోగికి పునర్జన్మ ప్రసాదించారని కొనియాడుతున్నారు.

రాజ్యసభ సభ్యుడు ధనంజయ్ మహాదిక్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. డాక్టర్ అర్జున్ కొల్హాపూర్‌లోనే గొప్ప వైద్యుడని కొనియాడారు. రియల్ లైఫ్ హీరోలు మన మధ్యనే నివసిస్తారని చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని అన్నారు. ఇలాంటి గౌరవనీయులు, మంచి వ్యక్తులకు అభినందనలని రాసుకొచ్చారు.
Maharashtra
Arjun Adnaik
Kolhapur
Heart Attack
CPR

More Telugu News