Rafael Nadal: యూఎస్ ఓపెన్​ లో పెను సంచలనం.. ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే నాదల్ ఔట్

  • ప్రపంచ రెండో ర్యాంకర్ కు షాకిచ్చిన అమెరికా ఆటగాడు ఫ్రాన్సిస్ టియఫో
  • ఈ ఏడాది గ్రాండ్ స్లామ్స్ టోర్నీల్లో నాదల్ కు ఇదే తొలి ఓటమి
  • ఇదే రౌండ్లో ఓడిన టాప్ సీడ్, నంబర్ 1 మెద్వెదెవ్
Frances Tiafoe knocks out Rafael Nadal in major US Open upset

యూఎస్ ఓపెన్లో అది పెద్ద సంచలనం నమోదైంది. ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్స్ గెలిచి జోరు మీదున్న ప్రపంచ రెండో ర్యాంకర్ రఫెల్ నాదల్ కు షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్ గా భావించిన నాదల్ పోరాటం ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఆటగాడు, 22వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో  6-4,4-6,6-4,6-3 స్కోరుతో నాదల్ ను ఓడించి సంచలనం సృష్టించాడు. 

కెరీర్ లో 23వ గ్రాండ్ స్లామ్ వేటలో ఉన్న నాదల్ కు ఈ ఏడాది మేజర్ టోర్నీల్లో ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. కిక్కిరిసిన ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. పేలవ సర్వీసులు, రిటర్న్ లతో నిరాశ పరిచాడు. తొలి సెట్ నే కోల్పోయిన రఫెల్ రెండో సెట్‌ గెలిచి స్కోరు సమం చేశాడు. 

కానీ, తర్వాతి రెండు సెట్లలో తేలిపోయాడు. దాంతో, ఐదోసారి నాదల్ సర్వీస్ బ్రేక్ చేస్తూ విజయం సాధించిన టియఫో తన కెరీర్లోనే అతి పెద్ద విక్టరీ ఖాతాలో వేసుకొని క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ డానిల్ మెద్వెదెవ్ ప్రి క్వార్టర్స్ రౌండ్లోనే ఓడిపోయాడు. దాంతో, క్వార్టర్స్ కు ముందే ఇద్దరు టాప్ సీడ్స్ ఇంటిదారి పట్టినట్టయింది.

More Telugu News