Cyrus Mistry: సీటు బెల్టు ధరించకపోతే... ఖరీదైన కార్లలోనూ ప్రాణానికి లేదు భరోసా!

Mandatory wearing of seat belt in rear seat could have saved Cyrus Mistry

  • సైరస్ మిస్త్రీ ప్రయాణించిన బెంజ్ కారులో ఏడు ఎయిర్ బ్యాగులు
  • వెనుక సీటులోని వారికి కేవలం పక్కనే అమరిక
  • సీటు బెల్ట్ ధరిస్తేనే తెరుచుకునే ఎయిర్ బ్యాగులు
  • దేశవ్యాప్తంగా 90 శాతం కార్లు 6 ఎయిర్ బ్యాగులు లేనివే

ఖరీదైన కార్లలోనూ ప్రయాణికులకు రక్షణ లేని పరిస్థితిపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ నడుస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ ఎస్ యూవీలో ప్రయాణించి కూడా ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ ప్రమాదంలో మరణించడం ఎంతో మందిని ఆశ్చర్యానికి లోను చేసింది. మన దేశంలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్న కార్లు 10 శాతం కూడా లేవు. పరిశ్రమ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఆరు ఎయిర్ బ్యాగులను కంపెనీలు ఆఫర్ చేస్తున్నప్పటికీ.. కొనుగోలు ధర తగ్గుతుందని చెప్పి ఎక్కువ మంది తక్కువ ఎయిర్ బ్యాగులున్న రకాలనే ఎంపిక చేసుకుంటున్నారు.

రెండు ఎయిర్ బ్యాగులు కార్లలో తప్పనిసరిగా ఉండాలని ఈ ఏడాది జనవరి నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు మనదేశంలోనే చోటుచేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర రవాణా మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ మరిన్ని భద్రతా ఫీచర్లను తీసుకురావాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. సాధారణంగా సీటు బెల్ట్ ధరించినప్పుడే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగులు తెరుచుకుంటాయి. అంటే ఎయిర్ బ్యాగులు ఉన్నా, సీట్ బెల్ట్ ధరించకపోతే రక్షణ ఉండదు. చాలా మంది వాహనదారులు దీన్ని అర్థం చేసుకోవడం లేదు. 

సైరస్ మిస్త్రీ ప్రయాణించిన మెర్సెడెజ్ బెంజ్ జీఎల్ సీ 220 డీ 4మ్యాటిక్ ఎస్ యూవీలో మొత్తం ఏడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఖరీదైన కారు అయినప్పటికీ వెనుక కూర్చున్న వారికి ముందు భాగంలో ఎయిర్ బ్యాగులు లేవు. పక్క భాగంలోనే ఉన్నాయి. ఇవి కూడా సీటు బెల్ట్ ధరించినప్పుడే తెరుచుకుంటాయి. మిస్త్రీ సీటు బెల్ట్ ధరించకపోవడంతో ప్రాణాలతో బయటపడలేకపోయారు. ఒకవేళ ఆయన సీటు బెల్ట్ ధరించి ఉంటే ఎయిర్ బ్యాగులు కాపాడేవి. ఏ కారులో అయినా సీటు బెల్ట్ అన్నది ప్రాథమిక నిరోధక వ్యవస్థ అవుతుంది. ఎయిర్ బ్యాగులు అన్నవి సప్లిమెంటరీ రీస్ట్రెయింట్ సిస్టమ్ అవుతాయి. 

మిస్త్రీ కారు ప్రమాదం తర్వాత ఢిల్లీ పోలీసులు వాహనదారుల భద్రత కోసం సూచనలు జారీ చేశారు. ‘‘వేగంగా వెళ్లకండి. సీటు బెల్ట్ తప్పకుండా ధరించండి. కారులో ఎక్కడ కూర్చున్నా సరే సీటు బెల్ట్ ధరించండి. బెల్ట్ ను లాక్ చేసుకోండి’’అని సూచించారు.

Cyrus Mistry
seat belt
car accident
air bags
safety
  • Loading...

More Telugu News