Kollu Ravindra: ఢిల్లీ మద్యం కుంభకోణంలో జగన్, భారతి, విజయసాయిరెడ్డి పాత్ర ఉన్నట్టు బయటపడింది: కొల్లు రవీంద్ర

TDP Leader Kollu Ravindra Accused jagan in Delhi liquor scam
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ5గా ఉన్న టైడెంట్ లైఫ్ సైన్సెస్ జగన్ సూట్‌కేసు కంపెనీ అన్న రవీంద్ర
  •  చంద్రబాబు దయవల్లే పోతుల సునీత రాజకీయాల్లోకి వచ్చారన్న టీడీపీ నేత
  • భువనేశ్వరి, బ్రహ్మణిపై అనుచిత వ్యాఖ్యలు తగవని హితవు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధం ఉందని టీడీపీ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. లిక్కర్ స్కాంలో వీరి పాత్ర కూడా ఉన్నట్టు ప్రపంచం మొత్తం చెబుతోందని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ ఏ5గా పేర్కొన్న ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థకు అదాన్ డిస్టిలరీస్ ద్వారా రూ. 2 వేల కోట్లను మళ్లించినట్టు రవీంద్ర ఆరోపించారు.

ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జగన్, విజయసాయిరెడ్డిల సూట్‌కేస్ కంపెనీ అని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జగన్ కుటుంబం, ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధం ఉందన్న విషయం సీబీఐ విచారణలో బయటపడిందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దయవల్లే రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని ఆమె మర్చిపోకూడదని హితవు పలికారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను చదివి మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడడం తగదని హితవు పలికారు. భువనేశ్వరి, బ్రహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు తగవన్నారు. హెరిటేజ్ సంస్థలను వారు లాభాల బాట పట్టించారని అన్నారు. పనికిమాలిన మద్యం బ్రాండ్లను తీసుకొచ్చి ఆ బురదను టీడీపీపై వేయాలని చూస్తున్నారని కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు.
Kollu Ravindra
YSRCP
YS Jagan
YS Bharthi
Vijayasai Reddy
TDP

More Telugu News