Hemant Soren: బల పరీక్షలో నెగ్గిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. బీజేపీపై తీవ్ర విమర్శలు

People Buy Ration But BJP Buys Legislators says Hemant Soren
  • ఓటింగ్ కు ముందు సభ నుంచి వాకౌట్ చేసిన బీజేపీ
  • ఎన్నికల్లో గెలుపొందేందుకు అల్లర్లను సృష్టిస్తున్నారన్న సోరెన్
  • సంతలో పశువుల్లా ప్రజాప్రతినిధులను బీజేపీ కొంటోందని మండిపాటు
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో నెగ్గారు. ఓటింగ్ కు ముందు బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. సభ్యుల్లో 48 మంది సోరెన్ కు అనుకూలంగా ఓటు వేశారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలను సోరెన్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు బలపరీక్షలో నెగ్గిన అనంతరం సోరెన్ మాట్లాడుతూ, తమ ఎమ్మెల్యేలలో చిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు అల్లర్లను సృష్టిస్తున్నారని విమర్శించారు. 

తమ ఎమ్మెల్యేలను కొనేందుకు చేసిన ప్రయత్నం వెనుక అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటోందని అన్నారు. ప్రజలు కిరాణా సరుకులు, దుస్తులు తదితరాలను కొనటం మనం చూశామని... కానీ బీజేపీ మాత్రం ప్రజా ప్రతినిధులను కొంటోందని ఎద్దేవా చేశారు. ఒక ఆదివాసీని తొలి రాష్ట్రపతిని చేసిన బీజేపీ.... ఇదే సమయంలో ఒక ఆదివాసీ ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
Hemant Soren
Jharkhand
BJP
Majority Test

More Telugu News