Team India: నేడు మరోసారి పాక్ తో భారత్ ఢీ.. ఈసారి గెలుపు అంత ఈజీ కాదు!

Unbeaten India eyeing second win against Pakistan in Super Four clash in Asia cup
  • ఆసియా కప్ లో ఇరు జట్ల మధ్య సూపర్‌- 4 పోరు నేడు
  • వరుసగా రెండు విజయాలతో సూపర్- 4కి వచ్చిన భారత్
  • హాంకాంగ్ పై రికార్డు విక్టరీతో జోరుమీదున్న పాకిస్థాన్ 
వారం వ్యవధిలోనే భారత్, పాకిస్థాన్ జట్లు రెండోసారి అమీతుమీ తేల్చుకొని క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచనున్నాయి. ఆసియా కప్ సూపర్‌–4 రౌండ్‌ లో భాగంగా ఈ రోజు రాత్రి ఇరు జట్లూ తలపడనున్నాయి. గ్రూప్-ఏ లో భాగంగా గత వారం జరిగిన తొలి పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని రోహిత్‌సేన భావిస్తుంటే.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్‌ కసిగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరోసారి ఉత్కంఠ పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది. ఆసియా కప్ లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు ఈ మ్యాచ్ లో కఠిన సవాల్ ఎదురవనుంది. గాయం వల్ల స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టుకు దూరం అవగా..  ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ ఇద్దరితో పాటు విరాట్‌ కోహ్లీ పవర్‌  ప్లే లో  నిదానంగా ఆడటంతో జట్టుకు మంచి ఆరంభం దక్కడం లేదు. పాక్‌పై కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌ అవ్వగా.. రోహిత్‌, కోహ్లీ కూడా ఇబ్బంది పడ్డారు. దాంతో, చిన్న లక్ష్య ఛేదనలో భారత్ చివరి ఓవర్‌ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. జడేజాతో హార్దిక్‌ పాండ్యా వీరోచిత పోరాటంతో జట్టు గెలిచింది. ఇప్పుడు జడేజా టీమ్‌కు దూరమయ్యాడు. 

ఈ నేపథ్యంలో ఓపెనర్లు తొలి ఓవర్‌ నుంచే బ్యాట్‌ ఝుళిపించాల్సి ఉంది. హాంకాంగ్‌పై అర్ధ సెంచరీతో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకం. కానీ, అతను వేగంగా ఆడాల్సిన అవసరం ఉంది. గత పోరులో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన సూర్యకుమార్‌పై ఈ సారి కూడా భారీ అంచనాలున్నాయి. గాయపడ్డ జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ కు బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా, బౌలింగ్‌ ఆల్‌రౌండర్ అశ్విన్‌ నుంచి పోటీ ఉంది. బౌలింగ్‌లో పేస్ లీడర్‌ భువనేశ్వర్‌తో పాటు హార్దిక్‌ పాండ్యా సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. కానీ, యువ బౌలర్లు అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ నిరాశ పరుస్తున్నారు. అవేశ్‌ ఖాన్‌ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని కోచ్ ద్రవిడ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడిని తప్పించి అదనపు బ్యాటర్ లేదా స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 

 మరోవైపు తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న పాకిస్థాన్ గత పోరులో హాంకాంగ్‌ పై 155 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంది. ఓపెనర్‌ రిజ్వాన్‌ ఫామ్‌  కొనసాగించగా.. ఫఖర్‌ జమాన్‌, కుష్దిల్‌ షా కూడా ఫామ్ లోకి రావడంతో టీమ్‌ బ్యాటింగ్‌ బలం పెరిగింది. ఈ పోరులో తొలి పది ఓవర్లలో ఎక్కువ రన్స్‌ చేయడంపై ఫోకస్‌ పెట్టింది. ఇక, బౌలింగ్‌లో ఆ జట్టుకు తిరుగులేదు. స్టార్‌ పేసర్ షాహీన్‌ ఆఫ్రిది ప్లేస్‌లో వచ్చిన 19 ఏళ్ల నసీమ్‌ షా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని నుంచి భారత బ్యాటర్లకు మరోసారి ముప్పు తప్పకపోవచ్చు. స్పిన్నర్లు మొహమ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ కూడా సత్తా చాటుతున్న నేపథ్యంలో భారత్ ఏచిన్న తప్పిదం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Team India
Pakistan
asia cup
match
Rohit Sharma
Virat Kohli

More Telugu News