V Prashanth Reddy: హరీశ్ రావు సవాల్ కు నిర్మలా సీతారామన్ వెనుకంజ వేశారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Minister Prashant Reddy comments on Nirmala Sitharaman
  • తెలంగాణలో నిర్మలా సీతారామన్ పర్యటన
  • టీఆర్ఎస్ సర్కారుపై ఘాటు విమర్శలు
  • వాస్తవాలు బయటపడతాయని ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని వ్యాఖ్యలు
  • తాము 2021లో చేరామన్న హరీశ్ రావు
  • చేరినట్టు వెల్లడైతే రాజీనామా చేస్తారా? అంటూ నిర్మలకు సవాల్
గత కొంతకాలంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు సవాళ్లు విసురుకునే స్థాయికి చేరింది. తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టీఆర్ఎస్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వాస్తవాలు బయటపడతాయనే తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని అన్నారు. 

అందుకు మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ, తాము 2021లోనే ఆయుష్మాన్ భారత్ లో చేరామని, చేరలేదని నిర్మలా సీతారామన్ నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. చేరినట్టు వెల్లడైతే నిర్మలా సీతారామన్ రాజీనామా చేస్తారా? అంటూ హరీశ్ సవాల్ విసిరారు. 

ఈ నేపథ్యంలో, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. హరీశ్ రావు సవాల్ కు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెనుకంజ వేశారని విమర్శించారు. సమాధానం చెప్పలేక భయపడి, మీడియా సమావేశమే రద్దు చేసుకున్నారని అన్నారు. కేసీఆర్ ను చూసి బీజేపీ హడలిపోతోందని, కేసీఆర్ జాతీయ స్థాయిలో పర్యటనలు చేస్తే తమ వైఫల్యాలు బట్టబయలవుతాయని కేంద్రం భయపడుతోందని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

ఇక, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ, నిర్మలా సీతారామన్ ను తాను అక్కగా భావిస్తానని, ఆమె తన నియోజకవర్గంలో పర్యటించారు కాబట్టి తాను స్పందించాల్సి వచ్చిందని వివరించారు. ప్రజల కోసం మంచి పథకాలు తీసుకువస్తే తాము కూడా సంతోషిస్తామని అన్నారు. నిర్మలా సీతారామన్ మళ్లీ తన నియోజకవర్గానికి రావాలని, ఆర్థిక వరాలు ఇవ్వాలని అన్నారు.
V Prashanth Reddy
Nirmala Sitharaman
Harish Rao
Ayushman Bharat
Telangana

More Telugu News