online: ఆన్​లైన్​ లో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్న కిరాణా వస్తువు ఇదేనట!

  • ఏడాదిలో వచ్చిన ఆర్డర్లను విశ్లేషించిన స్విగ్గీ ఇన్ స్టామార్ట్
  • గుడ్ల కోసం అత్యధిక ఆర్డర్లు వచ్చినట్టు తెలిపిన సంస్థ
  • రెండేళ్లలో ఐదు కోట్ల గుడ్లను డెలివరీ చేసినట్లు వెల్లడి
What Grocery Does India Order Online

భారత్ లో గత రెండేళ్ల నుంచి ఆన్‌ లైన్‌ లో ఆర్డర్ చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. కేవలం ఆహారం మాత్రమే కాదు, కిరాణా సామగ్రి, వైద్య సామగ్రి మొదలైన ఇతర నిత్యావసరాలను ప్రజలు ఆన్ లైన్ ద్వారా నేరుగా తమ ఇంటికే తెప్పించుకుంటారు. అయితే, కిరాణా వస్తువుల్లో  ప్రజలు ఎక్కువగా ఏం ఆర్డర్ చేస్తున్నారనే విషయంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది.  

ఇందుకోసం, 2021 జూన్-2022 జూన్ మధ్య తన యాప్‌లో చేసిన మిలియన్ల కొద్దీ ఆర్డర్‌లను విశ్లేషించింది. ఈ 12 నెలల్లో కెనడా జనాభా కంటే బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ లనుంచి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని యాప్ వెల్లడించింది. ప్రజలు ఆన్‌లైన్‌లో అత్యధికంగా కోడిగుడ్లను అర్డర్ చేసినట్టు తెలిపింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ గత రెండేళ్లలో 5 కోట్ల గుడ్లను డెలివరీ చేసింది.

బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో అల్పాహారం కోసం గుడ్లను ఆర్డర్ చేయగా..  ముంబై, జైపూర్, కోయంబత్తూర్ లో రాత్రి భోజన సమయంలో గుడ్లను ఎక్కువగా ఆర్డర్ చేశారని వెల్లడించింది. గుడ్లతో పాటు పాలు, పాల పదార్థాలకు కూడా ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది. స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో సాధారణ పాలు, ఫుల్ క్రీమ్ పాలు, టోన్డ్ మిల్క్ వంటి వివిధ రకాల పాల కోసం గత రెండేళ్లలో 30 మిలియన్ల ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది.

ఇక నిత్యావసరాలు కాకుండా, ఐస్ క్రీమ్‌లు, జ్యూస్‌లు కూడా వేసవి నెలల్లో ఏప్రిల్-జూన్ వరకు బాగా ప్రాచుర్యం పొందాయి. వేసవిలో ఐస్‌క్రీమ్ ఆర్డర్‌లు 42% పెరిగాయి. హైదరాబాద్‌లో 27,000 తాజా జ్యూస్ బాటిళ్లను వినియోగదారులు ఆర్డర్ చేశారు. హైదరాబాద్, బెంగుళూరులో పచ్చి మిరపకాయల కోసం కూడా ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఈ రెండు నగరాల్లో గత సంవత్సరంలో 290 టన్నుల కందిపప్పు డెలివరీ చేసినట్టు స్విగ్గీ తెలిపింది. అలాగే, సేంద్రియ పండ్లు, కూరగాయలకు డిమాండ్ 58 రెట్లు పెరిగిందని సిగ్గీ ఇన్ స్టామార్ట్ వెల్లడించింది.

More Telugu News