Asia CUP: ఆసియా కప్​ లో అరుదైన రికార్డు సాధించిన జడేజా

  • ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత
  • ఇప్పటిదాక  23 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్ ఆల్ రౌండర్
  • ఇర్ఫాన్ పఠాన్ రికార్డును అధిగమించిన జడేజా
Ravindra Jadeja becomes Indias most successful bowler in Asia Cup

భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత  సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తున్న జడేజా ఈ టోర్నీలో ఓ రికార్డు బద్దలు కొట్టాడు. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. దుబాయ్‌ వేదికగా బుధవారం రాత్రి హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్లో జడేజా ఈ ఘనత సాధించాడు. 2010 నుంచి 2022 వరకు జరిగిన ఆరు ఆసియా కప్ టోర్నీల్లో జడేజా 23 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 22 వికెట్లతో భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 

జడేజా 2010లో తన తొలి ఆసియా కప్‌లో నాలుగు వికెట్లు, 2012లో ఒక వికెట్, 2014 ఎడిషన్ లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆడిన 2016 టోర్నమెంట్‌లో మూడు వికెట్లు తీశాడు. 2018 ఆసియా కప్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అతను ఇప్పటి వరకు ఒక వికెట్ తీసుకున్నాడు. 

కాగా, ఆసియా కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్ గా శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ 30 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. అదే దేశానికి చెందిన లసిత్ మలింగ (29 వికెట్లు), అజంతా మెండిస్ (26 వికెట్లు), పాకిస్థాన్‌కు చెందిన సయీద్ అజ్మల్ (25 వికెట్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. 

కాగా, హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో గెలిచి ఆసియా కప్ సూపర్4 దశకు అర్హత సాధించింది. హాంకాంగ్ చివరి గ్రూప్-ఎ మ్యాచ్ లో పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఇందులో నెగ్గిన జట్టు ఆదివారం  జరిగే  సూపర్ 4  రెండో గేమ్లో భారత్ తో పోటీ పడుతుంది. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంకతో జరిగిన రెండు  మ్యాచ్‌లలో గెలిచిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే సూపర్ 4కి అర్హత సాధించింది. ఈ రోజు రాత్రి బంగ్లా, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ లో విజేత సూపర్ 4 కి చేరుకుంది.

More Telugu News