YSRCP: రేపు సొంత జిల్లా ప‌ర్య‌ట‌న‌కు జ‌గ‌న్‌... 3 రోజుల పాటు క‌డ‌ప జిల్లాలోనే ఏపీ సీఎం

  • వైఎస్సార్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ‌కు జ‌గ‌న్‌
  • ముందు రోజే ఇడుపులపాయ చేరుకోనున్న జ‌గ‌న్‌
  • వ‌రుస‌గా రెండు రాత్రులు ఇడుపుల‌పాయ ఎస్టేట్‌లోనే బ‌స‌
  • శుక్ర‌వారం త‌న తండ్రి వైఎస్సార్‌కు నివాళి అర్పించ‌నున్న జ‌గ‌న్‌
ys jagan tours his own constituency for tjree days from tomorrow

వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సెప్టెంబ‌ర్ 1న‌ (గురువారం) త‌న సొంత జిల్లా క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. రేప‌టి నుంచి 3 రోజుల పాటు ఆయ‌న క‌డ‌ప జిల్లాలోనే ప‌ర్య‌టించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 2న త‌న తండ్రి, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు నివాళి అర్పించేందుకు జ‌గ‌న్ క‌డ‌ప జిల్లాకు వెళుతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు ఏపీ సీఎంఓ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది.

రేపు (సెప్టెంబ‌ర్ 1)న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో తాడేప‌ల్లిలోని త‌న ఇంటి నుంచి బ‌య‌లుదేర‌నున్న సీఎం జ‌గ‌న్‌... గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో క‌డ‌ప‌కు బ‌య‌లుదేర‌తారు. మ‌ధ్యాహ్నం 3.20 గంట‌ల‌కు క‌డ‌ప చేరుకోనున్న జ‌గ‌న్‌... అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో త‌న సొంత నియోజ‌కవ‌ర్గం పులివెందుల‌లోని వేముల మండ‌లం వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. అక్క‌డ నూత‌నంగా నిర్మించిన స‌చివాల‌య భ‌వ‌నాన్ని ప్రారంభించిన అనంత‌రం సాయంత్రం 5.35 గంట‌ల‌కు వేంప‌ల్లి మండ‌లంలోని త‌న సొంత ఎస్టేట్ ఇడుపుల‌పాయ‌కు చేరుకుంటారు.

గురువారం రాత్రికి ఇడుపులపాయ‌లోనే బ‌స చేయ‌నున్న జ‌గ‌న్‌... శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి 9.40 గంట‌ల వ‌రకు త‌న తండ్రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైఎస్సార్ ఘాట్‌లో జ‌రిగే ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొంటారు. అనంత‌రం పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న‌లు చేస్తారు. అనంత‌రం అధికారుల‌తో స‌మీక్ష త‌ర్వాత సాయంత్రం తిరిగి ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని రాత్రికి అక్క‌డే బ‌స చేస్తారు. ఆ త‌ర్వాత శ‌నివారం ఉద‌యం 8.50 గంట‌ల‌కు ఇడుపులపాయ నుంచి బ‌య‌లుదేరి 10.10 గంట‌ల‌కు గ‌వ‌న్న‌రం ఎయిర్‌పోర్టు చేరుకుని...అక్క‌డి నుంచి తాడేప‌ల్లిలోని త‌న ఇంటికి చేరుకుంటారు.

More Telugu News