EPFO: ఇకపై అందరికీ ఈపీఎఫ్ వో.. వేతన పరిమితి ఎత్తివేత ప్రతిపాదన

  • ప్రస్తుతం రూ.15,000 వేతనం పరిధిలోని వారికి తప్పనిసరిగా ఈపీఎఫ్ వో
  • అంతకుమించి వేతనం ఉంటే స్వచ్ఛందమే
  • ఇక మీదట వేతనంతో సంబంధం ఉండదు
  • కనీసం 20 మంది ఉద్యోగులు ఉండాల్సిన పనిలేదు
EPFO wants wage headcount limits to be removed

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) వేతన పరిమితి, ఉద్యోగుల సంఖ్య విషయంలో పరిమితులు ఎత్తి వేయాలని చూస్తోంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం రూ.15,000 వేతనం వరకు ఉన్నవారు (మూలవేతనం, డీఏ) ఈపీఎఫ్ వో పరిధిలో చేరడం తప్పనిసరి. అంతకుమించి వేతనం ఉన్న వారు స్వచ్ఛందంగా చేరొచ్చు. ఇకపై వేతనంతో  సంబంధం లేకుండా అందరినీ ఇందులో భాగం చేయాలన్నది ప్రతిపాదన.

అలాగే, ఈపీఎఫ్ వో కిందకు రావాలంటే కనీసం 20 మంది, అంతకు మించి ఉద్యోగులు ఉన్న సంస్థలకే అనుమతి ఉంది. ఇక మీదట ఈ పరిమితి తొలగించాలనే ప్రతిపాదనను కూడా ఈపీఎఫ్ వో తీసుకొచ్చింది. భాగస్వాములు, రాష్ట్రాలతో ఈ ప్రతిపాదనను ఈపీఎఫ్ వో పంచుకుంది. 

ప్రస్తుతం ఈపీఎఫ్ వో కింద 5.5 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. పరిమితులు ఎత్తివేస్తే ఈపీఎఫ్ పథకాన్ని సంఘటిత రంగంలో పనిచేసే అందరితోపాటు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి సైతం ఆఫర్ చేయడానికి అవకాశం లభిస్తుందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. రూ.15,000 వరకు వేతనంపై ఉద్యగి నుంచి 12 శాతం, పని చేయించుకునే సంస్థ 12 శాతం చందాగా చెల్లించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. రూ.15వేలకు పైన వేతనాలు ఉన్నవారు స్వచ్ఛందంగా చేరినా ఇదే పరిమితి మేరకు 12 శాతం వాటాలను వసూలు చేస్తున్నారు.

మరి ఒకవేళ ఈ పరిమితి ఎత్తివేస్తే అప్పుడు అధిక వేతనం పొందే ఉద్యోగులు మరింత వాటాను జమ చేసుకోవచ్చు. దీనికి సమాంతరంగా పనిచేయించుకునే సంస్థలు చందా జమ చేయక్కర్లేదు. అవి ఇప్పటి మాదిరే రూ.15 వేలపై 12 శాతాన్ని జమ చేస్తే చాలన్నది ప్రతిపాదన.

More Telugu News