ఆగిపోయిన రష్మిక మందన్న, టైగర్ ష్రాఫ్ ల చిత్రం
- రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ అడిగిన టైగర్ ష్రాఫ్
- రూ. 20 కోట్లు పారితోషికం, లాభాల్లో వాటా తీసుకోవాలన్న కరణ్ జొహార్
- టైగర్ ష్రాఫ్ ఒప్పుకోకపోవడంతో ఆగిపోయిన సినిమా
వివరాల్లోకి వెళ్తే, 'స్క్రూ ఢీలా' చిత్రాన్ని రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చేసేందుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పై టైగర్ ష్రాఫ్ సంతకం చేశాడు. అయితే, పారితోషికాన్ని తగ్గించుకోవాలని.. లాభాల్లో వాటా తీసుకోవాలని టైగర్ ను కరణ్ జొహార్ కోరారు. రూ. 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవాలని చెప్పారు. నటీనటుల రెమ్యునరేషన్లతో కలుపుకుని సినిమా నిర్మాణానికి రూ. 140 కోట్ల వరకు ఖర్చవుతోందట. దీనికి సినిమా ప్రచార కార్యక్రమాల ఖర్చు అదనం.
ప్రస్తుతం బాలీవుడ్ విషమ పరీక్షలను ఎదుర్కొంటోంది. సినిమాలు పెద్దగా వసూళ్లను రాబట్టడం లేదు. దీంతో రెమ్యునరేషన్ తగ్గించుకుని లాభాల్లో వాటా తీసుకోవాలని టైగర్ ష్రాఫ్ ను కరణ్ జొహార్ కోరారు. అయితే, పారితోషికాన్ని తగ్గించుకోవడానికి టైగర్ ఒప్పుకోలేదు. దీంతో, సినిమా ఆగిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో, రష్మిక ఒక బాలీవుడ్ సినిమాను కోల్పోయినట్టయింది.