Sai Priya: ప్రియుడితో పరారై పోలీసులను తప్పుదోవ పట్టించిన సాయిప్రియపై కేసు నమోదు

Case filed against sai priya and her lover in visakhapatnam
  • గతనెల 22న భర్తతో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లిన సాయిప్రియ
  • అక్కడి నుంచి మాయమై బెంగళూరులోని ప్రియుడి వద్దకు చేరుకున్న వైనం
  • పోలీసుల సమయం, ధనం వృథా చేశారంటూ అభియోగాలు
  • కోర్టు అనుమతితో ఇద్దరిపైనా కేసు నమోదు
భర్తతో కలిసి బీచ్‌కు వెళ్లి ఆపై అక్కడి నుంచి పరారై బెంగళూరులోని ప్రియుడి వద్ద తేలిన సాయిప్రియతోపాటు ఆమె ప్రియుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖపట్టణంలోని ఎన్‌ఏడీ సమీపంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన సాయిప్రియ-శ్రీనివాసరావు భార్యాభర్తలు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసరావు జులై 22న పెళ్లి రోజును జరుపుకునేందుకు విశాఖ వచ్చాడు. 

ఆ రోజు సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం 7.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆపై ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. ఆయన పక్కకు వెళ్లి మాట్లాడుతుండగా ఇదే అదునుగా భావించిన సాయిప్రియ క్షణాల్లోనే మాయమైంది. భార్య కనిపించకపోవడంతో శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సాయిప్రియ సముద్రంలో కొట్టుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో స్పీడ్‌బోట్లు, నేవీ హెలికాప్టర్ సాయంతో గాలించారు. ఇందుకోసం అధికారులు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. అయితే, ఆ తర్వాత ఆమె బెంగళూరులో ఉన్న ప్రియుడి వద్దకు చేరుకున్నట్టు తెలియడంతో కథ సుఖాంతం అయింది. 

తాజాగా, ఈ కేసులో వైజాగ్ పోలీసులు కోర్టు అనుమతితో సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. ప్రియుడితో పరారైన సాయిప్రియ అందరినీ తప్పుదోవ పట్టించిందని, ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసిందని వారిపై అభియోగాలు నమోదయ్యాయి.
Sai Priya
Visakhapatnam
Navy
RK Beach

More Telugu News