Gujarat: బిల్కిస్ బానో దోషుల విడుదల విషయం తెలిసి ఆశ్చర్యపోయాం.. వారిని మళ్లీ జైలుకు పంపండి: సీజేఐకి మాజీ ఉన్నతాధికారుల బహిరంగ లేఖ

  • దోషుల విడుదల ద్వారా భయంకరమైన తప్పిదం జరిగిందని లేఖ
  • వారిని తిరిగి జైలుకు పంపడం ద్వారా తప్పును సరిదిద్దాలని అభ్యర్థన
  • గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం తమను ఆశ్చర్యపరిచిందంటూ లేఖ
134 ex bureaucrats want wrong decision in Bilkis Bano case rectified

బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయడం ద్వారా భయంకరమైన తప్పిదం జరిగిందని, దానిని సరిచేయాలని కోరుతూ 134 మంది మాజీ ప్రభుత్వాధికారులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సామూహిక అత్యాచారం, హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఈ నెల 15న శిక్షాకాలం తగ్గించి విడుదల చేసింది. వారి విడుదలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా సీజేఐకి లేఖరాస్తూ.. దోషులను మళ్లీ జైలుకు పంపడం ద్వారా జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలని కోరారు.

స్వాతంత్ర్య దినోత్సవాన దేశంలోని ప్రజలు అందరిలానే తాము కూడా గుజరాత్‌లో చోటుచేసుకున్న పరిణామాలు చూసి ఆశ్చర్యపోయామని ఆ లేఖలో పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంతో తాము ఎంతగానో బాధపడ్డామని, అందువల్లే ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ఈ లేఖ రాసిన 134 మందిలో ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, మాజీ కేబినెట్ కార్యదర్వి కె.ఎం.చంద్రశేఖర్, మాజీ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శులు శివశంకర్ మీనన్, సుజాతాసింగ్, మాజీ హోం కార్యదర్శి జి.కె.పిళ్లై తదితరులు ఉన్నారు.

More Telugu News