Pakistan: పాకిస్థాన్‌లో వైల్డ్ పోలియో వైరస్ కేసులు.. ఉగ్రవాదుల దుష్ప్రచారం వల్లేనంటున్న అధికారులు

  • పంజాబ్, ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్సులలో కేసులు
  • ఏడాది తర్వాత ఇదే తొలిసారి
  • 17 ప్రాంతాల్లోని పర్యావరణ నమూనాల్లో వైరస్ గుర్తింపు
  • పోలియో టీకాల వల్ల వంధ్యత్వం వస్తుందని ఉగ్రవాదుల ప్రచారం
  • ఊళ్లోకి వస్తున్న కార్యకర్తలపై దాడులు
Pakistan Records 14 Wild polio Cases

ప్రపంచంలోని చాలా దేశాలు పోలియోను నిర్మూలించాయి. మన దేశం కూడా పోలియోను తరిమికొట్టింది. కొన్ని దేశాల్లో మాత్రం అడపాదడపా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా, పొరుగుదేశం పాకిస్థాన్‌లో పోలియో కేసులు వెలుగు చూశాయి. పంజాబ్‌, ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్సుల్లోని పెషావర్‌, బన్ను, లాహోర్‌ పట్టణాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. 

పిల్లల్లో అంగవైకల్యం కలిగించే వైల్డ్ పోలియో వైరస్ కేసులను గుర్తించినట్టు పాకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా 70 ప్రాంతాల నుంచి పర్యావరణ నమూనాలు సేకరించినట్టు పేర్కొంది. వీటిలో 17 ప్రాంతాల్లో వైల్డ్ పోలియో-1ను గుర్తించినట్టు పేర్కొంది. అయితే, సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్సులలో రుతుపవన వర్షాలు, వరదల కారణంగా దేశవ్యాప్తంగా వైరస్ ఉనికిని గుర్తించలేకపోయామని తెలిపింది.  

నిజానికి పాకిస్థాన్‌ ఏడాదిపాటు పోలియో రహితంగానే ఉంది. తాజాగా 14 కేసులు వెలుగు చూడడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2014లో దేశంలో 306 కేసులు నమోదు కాగా, అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో కేసులు నమోదు కావడం కొంత ఊరటనిచ్చే అంశమే. పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లోనూ పోలియో కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌లు కూడా ఇటీవల మురుగునీటిలో పోలియో వైరస్‌ను గుర్తించాయి. 

కాగా, పోలియో చుక్కలు వేసుకుంటే భవిష్యత్తులో పిల్లల్లో వంధ్యత్వం కలుగుతుందని ప్రచారం చేస్తున్న మిలిటెంట్లు.. ఆరోగ్య కార్యకర్తలు ఊళ్లలోకి రాకుండా దాడులు చేస్తున్నారని, ఈ కారణంగా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయని పాకిస్థాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

More Telugu News