TFCC: థియేటర్లూ ఇవ్వరు.. ఓటీటీలోనూ వద్దంటే ఎలా?: ప్రతాని రామకృష్ణ గౌడ్

  • నిర్మాతలపై ఆంక్షలు విధించడం సరికాదన్న ప్రతాని
  • నిర్మాతల కష్టాలు తనకు తెలుసన్న టీఎఫ్‌సీసీ చైర్మన్
  • సినిమా ఎప్పుడు అమ్ముకోవాలో నిర్మాతకే వదిలేయాలని సూచన
  • ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్తబ్ధత నెలకొందన్న ప్రతాని
I Know producers Problems says tfcc chairman pratani ramakrishna goud

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్తబ్ధత నెలకొందని తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. నిర్మాతల కష్టనష్టాలు తనకు తెలుసని, కాబట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న ఘటనలతో తాను ఏకీభవించబోనని పేర్కొన్నారు. 

తన సినిమాను ఎప్పుడు అమ్ముకోవాలో నిర్మాతే నిర్ణయించుకోవాలని అన్నారు. అంతేకానీ,  తన సినిమాను ఎప్పుడు అమ్ముకోవాలో అసోసియేషనో, మరోటో చెప్పడం సరికాదని అన్నారు. ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ అమ్ముకునే అవకాశం నిర్మాతకు ఉండాలన్నారు. థియేటర్లూ ఇవ్వకుండా, ఓటీటీలోనూ విడుదల చేసుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, నిర్మాతలపై అసోసియేషన్ ఆంక్షలు కనుక పెడితే సినిమా విడుదలకు థియేటర్స్‌ను కూడా పర్సెంటేజీ విధానంలో ఇవ్వాలని, అదే తమ డిమాండ్ అని అన్నారు.

మలేషియాలో ఉన్న ‘సన్‌షైన్’ ఓటీటీ సంస్థను టీఎఫ్‌సీసీతో కలిసి బొల్లు నాగశివప్రసాద్ త్వరలోనే ఇండియాలోనూ ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించిన ప్రతాని మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోందని అన్నారు. సన్‌షైన్ ఓటీటీ ద్వారా తెలుగు సహా అన్ని భాషల చిత్రాలను విడుదల చేస్తామని ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.

More Telugu News