Diabetes: మధుమేహానికి మూల కారణాలు ఇవీ..

  • పొగతాడం వల్ల 40 శాతం రిస్క్
  • పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు
  • కదలికల్లేని జీవనశైలితో అనర్థాలు
  • స్థూలకాయంతో మరింత ముప్పు
Root Causes of Diabetes Say Doctors

టైప్-2 మధుమేహం అన్నది.. జీవనశైలి, ఆహారం, ఇతర అలవాట్ల రూపంలో ఎవరికి వారు స్వయంగా ఆహ్వానం పలికే ఆరోగ్య సమస్య. టైప్-1 జన్యు, వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి. టైప్-2 మధుమేహం బారిన పడటం లేదా దానికి దూరంగా ఉండడం అన్నది స్వీయ నియంత్రణలోనే ఉందన్నది వైద్యులు చెప్పే మాట. మధుమేహం ఆరోగ్య సమస్యే అయినా.. ఎన్నో వ్యాధులకు, జీననకాలం తగ్గేందుకు దారితీసే మహమ్మారి. గుండె, మూత్రపిండాలు, కళ్ల ఆరోగ్యాన్ని మధుమేహం దెబ్బతీస్తుంది. మధుమేహం జీవన కాలాన్ని సుమారు పదేళ్లు తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. టైప్-2 డయాబెటిస్ కు నిపుణులు చెప్పే ప్రధాన కారణాలను చూద్దాం..

పొగతాగడం
పొగతాగడానికి, మధుమేహానికి లింక్ ఏంటన్నది వినడానికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, పొగతాగే అలవాటు ఉన్న వారికి మధుమేహం వచ్చే రిస్క్ 40 శాతం ఉంటుందని అమెరికాకు చెందిన సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంటోంది. మధుమేహానికి సంబంధించి మార్పుచేసుకోతగిన రిస్క్ ఫ్యాక్టర్ గా పొగతాగడాన్ని పేర్కొంటున్నారు హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ ఫ్రాంక్ బీ హు. 

అధిక పిండి పదార్థాలు
టైప్-2 మధుమేహంతో బాధపడే వారు కానీ, దీని బారిన ఇంకా పడని వారు కానీ పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలన్నది నిపుణుల సూచన. రక్తంలో షుగర్ పరిమాణాన్ని నియంత్రణలో పెట్టుకోవాలంటే మొత్తంగా ఒక రోజులో తీసుకునే కార్బోహైడ్రేట్ల పరిమాణంపై అవగాహన కలిగి ఉండాలి. కూరగాయలు అయిన స్వీట్ పొటాటో (చిలగడదుంప), మొక్కజొన్న (స్వీట్ కార్న్), బఠానీల్లోనూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.
 
కదలికల్లేని జీవనశైలి
 కూర్చుని ఎక్కువ గంటల పాటు పనిచేసేవారికి టైప్-2 మధుమేహం రిస్క్ చాలా ఎక్కువని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఒకవేళ రోజులో కొద్ది సేపు వ్యాయామం చేసి, మిగిలిన రోజులో సుదీర్ఘ సమయం పాటు తింటూ, తాగుతూ కూర్చుని పనులు చేసుకునే వారికి కూడా మధుమేహం రిస్క్ ఉంటుంది. కాకపోతే వారు చేసే వ్యాయామాలతో ఆ రిస్క్ తగ్గించుకోవడం సాధ్యపడుతుంది. కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్న వారు అరగంట లేదా గంట వ్యవధిలో ఒక్కసారైనా ఒక నిమిషం పాటు కదలడం చేయాలి. దీనికితోడు రోజువారీ మిగిలిన సమయం అంతా చురుగ్గా ఉండేలా చూసుకోవాలి.

స్థూలకాయం
 అధిక బరువు చాలా అనర్థాలు తెస్తుందని ఎన్నో పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా స్థూలకాయం ఉన్నవారికి టైప్-2 మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు కూడా వారికి ఎక్కువే అని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. అధిక రక్తపోటుకు కూడా దారితీస్తుంది. అందుకని బరువు ఎక్కువగా ఉన్నవారు వెంటనే తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలి.

More Telugu News