Vitamin D: ఈ నరాల జబ్బులకు విటమిన్ డి లోపమే కారణమట!

  • మానవ దేహానికి అత్యంత కీలకమైనది విటమిన్ డి
  • శరీర జీవక్రియలకు ఊతం
  • మెదడు ఆరోగ్యానికి విటమిన్ డియే ఆలంబన
  • విటమిన్ డి లోపంతో నరాల, మానసిక జబ్బులు
Vitamin D deficiency leads to neurological disorders

శరీర జీవక్రియలకు అత్యంత ఆవశ్యకమైనది విటమిన్ డి. కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ధాతువులను శరీరం గ్రహించాలంటే విటమిన్ డి తోడ్పాటు తప్పనిసరి. చర్మంపై సూర్యకాంతి పడినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. చాలామందిలో వారికి తెలియకుండానే విటమిన్ డి లోపిస్తుంటుంది. వారి పనితీరు, జీవనవిధానాలే ఈ కీలక విటమిన్ లోపించడానికి దారితీస్తాయి. 

అయితే, విటమిన్ డి లోపంతో అనేక నరాల జబ్బులు కలుగుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది. విటమిన్ డి శరీరంలో తగినంత మోతాదులో లేకపోతే అనేక ఖనిజ లవణాలు కూడా శరీరంలో లోపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు కాల్షియం ఎముకల పటిష్ఠతకు దోహదపడుతుందని, కానీ విటమిన్ డి తగినంత మోతాదులో లేకపోతే కాల్షియం కూడా లోపిస్తుందని, తద్వారా ఎముకలు బలహీనపడతాయని వివరించారు. 

పిల్లల్లో విటమిన్ డి లోపంతో రికెట్స్ వ్యాధి కలుగుతుందట. దాంతో ఎముకలు బోలుగా మారి, పిల్లలు ఎముకల గూడులా కనిపిస్తారు. విటమిన్ డి లోపిస్తే ఈ సాధారణ లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అలసట, కీళ్లలో నొప్పులు, కండరాల బలహీనత, తరచుగా భావోద్వేగాలు మారిపోవడం, కొన్ని సందర్భాల్లో తలనొప్పి కూడా కనిపిస్తుంది. తరచుగా రక్తపరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయులను తెలుసుకోవచ్చు.

ముఖ్యంగా, విటమిన్ డి మెదడు ఆరోగ్యానికి అత్యంత కీలకమైనది. మనిషి జ్ఞాపకశక్తిని ఇది ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, విటమిన్ డి లోపంతో అనేక నరాల జబ్బులు, మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. 

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే... విటమిన్ డి ఒక న్యూరోస్టెరాయిడ్ లా పనిచేస్తుందట. మెదడుకు తగినంతగా విటమిన్ డి అందకపోతే మల్టీఫుల్ స్ల్కిరోసిస్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు, విటమిన్ డి లోపంతో డిప్రెషన్ (మానసిక కుంగుబాటు) కూడా సంభవిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న మహిళల్లో తరచుగా వారి భావోద్వేగాల్లో మార్పులకు ఈ విటమిన్ డి తగ్గిపోవడమే కారణమని తెలుసుకున్నారు. 

అందుకే ప్రతి ఒక్కరూ విటమిన్ డిని శరీరంలో తగినంతగా కలిగి ఉండడంపై శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. పెద్దవాళ్లకైతే రోజుకు 10 నుంచి 20 మైక్రోగ్రాముల విటమిన్ డి అవసరం. శిశువులు, చిన్నారులు, టీనేజర్లు, వృద్ధులు ఇంతకంటే ఎక్కువ మోతాదులో విటమిన్ డి కలిగి ఉండాలట. 

సాల్మన్, సార్డైన్, మాక్రెల్, హెర్రింగ్స్ వంటి చేపలు, రెడ్ మీట్, లివర్, గుడ్డు పచ్చసొన, పాలు, జున్ను, కొన్ని ప్రత్యేకమైన పుట్టగొడుగులు, బాదం పప్పులు, ఆరెంజ్ జ్యూస్, ఓట్స్, సోయా బీన్స్ వంటి ఆహారపదార్థాల్లో విటమిన్ డి లభ్యమవుతుంది.

More Telugu News