Arvind Kejriwal: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. కీలకమైన హామీ ఇచ్చిన కేజ్రీవాల్

Will create 10 laks jobs if we get into power in Gujarat says Kejriwal
  • గుజరాత్ లో అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్న కేజ్రీవాల్
  • నెలకు రూ. 3 వేల నిరుద్యోగభృతి ఇస్తామని హామీ
  • ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాన్ని కల్పించడమే లక్ష్యమని వ్యాఖ్య
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ... ఇప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రం గుజారాత్ పై కన్నేసింది. త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. 

గుజరాత్ లో ఆప్ అధికారంలోకి వస్తే.... 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాన్ని కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. గిర్ సోమ్ నాథ్ జిల్లాలోని వెరావల్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఢిల్లీ మోడల్ విద్య, వైద్యం అందిస్తామని ఇంతకు ముందే కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.   

గుజరాత్ కు రూ. 3.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని కేజ్రీవాల్ చెప్పారు. మీకు ఇక్కడి ప్రభుత్వం ఏదైనా ఉచితంగా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మీకు ఏదీ ఉచితంగా ఇవ్వనప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఎందుకు ఉన్నాయని అడిగారు. కేవలం అవినీతి వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు.
Arvind Kejriwal
AAP
Gujarat

More Telugu News