Sanjay Raut: ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్... ఇంటి భోజనానికి అనుమతి

  • చావల్ కుంభకోణంలో రౌత్ పై ఆరోపణలు
  • ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్
  • 8 రోజుల కస్టడీ కోరిన ఈడీ
  • 4 రోజుల కస్టడీకి ఇచ్చిన స్పెషల్ కోర్టు
  • రౌత్ హృద్రోగంతో బాధపడుతున్నారన్న న్యాయవాది
Four days custody for Sanjay Raut

చావల్ కుంభకోణంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పాత్ర కూడా ఉందని, ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయనను ఇవాళ ముంబయి స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా, ఆగస్టు 4 వరకు కస్టడీ విధించారు. అంతేకాదు, ఇంటి నుంచి భోజనం, ఔషధాలు స్వీకరించేందుకు కోర్టు రౌత్ కు అనుమతి మంజూరు చేసింది. ఒకవేళ విచారణ సమయంలో అవసరమైతే చికిత్స కూడా పొందే వెసులుబాటు కల్పించింది. 

సంజయ్ రౌత్ హృద్రోగంతో బాధపడుతున్నారని, అందుకు గాను చికిత్స పొందుతున్నారని ఆయన తరఫు న్యాయవాది అశోక్ ముందర్గీ కోర్టుకు వివరించారు. ఆయనకు ఇప్పటికే శస్త్రచికిత్స కూడా జరిగిందని వెల్లడించారు. రౌత్ ను రాజకీయ దురుద్దేశాలతోనే అరెస్ట్ చేశారని న్యాయవాది ఆరోపించారు. 

కాగా, ఇవాళ ఈడీ అధికారులు రౌత్ ను కోర్టులో హాజరుపరిచే ముందు ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కోర్టులోకి ప్రవేశిస్తూ, తమను అంతం చేసేందుకు ఈ కుట్ర పన్నారని రౌత్ మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా, రౌత్ కు ఎనిమిది రోజుల కస్టడీ విధించాలని ఈడీ కోరగా, కోర్టు అందుకు నిరాకరించింది. కేవలం 4 రోజుల కస్టడీ విధించింది. 

ఆదివారం అర్థరాత్రి సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేయగా, ఇవాళ ఆయన కుటుంబ సభ్యులను శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పరామర్శించారు. రౌత్ తల్లి పాదాలకు నమస్కరించిన థాకరే, ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఇతర కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

More Telugu News