Maharashtra: సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ.. శివసేనను అంతం చేసే కుట్ర అన్న ఉద్ధవ్ థాకరే

  • ఆదివారం ఉదయం నుంచీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు
  • సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటన
  • భారీగా బలగాల మోహరింపు, భద్రత మధ్య సంజయ్ రౌత్ ను తీసుకెళ్లిన ఈడీ అధికారులు
ED arrested Sanjay Raut This is a conspiracy to end Shiv Sena says Uddhav Thackeray

ఉద్ధవ్ థాకరే శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి రెండు సార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదంటూ.. ఆదివారం ఉదయం నుంచే సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సాయంత్రం వరకు తనిఖీలు చేయడంతోపాటు సంజయ్ రౌత్ ను, ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను సంజయ్ రౌత్ నివాసం వద్ద మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు.

నకిలీ ఆధారాలు సృష్టించారన్న సంజయ్ రౌత్
ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు వ్యతిరేకంగా తప్పుడు ఆధారాలను సృష్టించారు. శివసేనకు, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఇది. దీనికి నేను భయపడబోను..” అని ప్రకటించారు.

శివసేనను అంతం చేసే కుట్ర: ఉద్ధవ్ థాకరే
శివసేన పార్టీని అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని.. ఈ క్రమంలోనే పార్టీ నేతలపై ఈడీ దాడులకు పాల్పడుతున్నారని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ దాడులు ఈ కుట్రలో భాగమేనని, ఆయనను అరెస్టు చేసేందుకే ఇదంతా చేశారని పేర్కొన్నారు. 

More Telugu News