Arpita Mukherjee: ఆ అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లోర్ మొత్తం అర్పిత, పార్థ ఛటర్జీ కుక్కల కోసమేనట!

Single floor in apartment allotted for dogs of Arpita and Partha Chatterjee
  • సంచలనం సృష్టించిన టీచర్ ఉద్యోగాల స్కాం
  • ఈడీ అదుపులో మాజీ మంత్రి పార్థ ఛటర్జీ
  • నటి అర్పిత ముఖర్జీ ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనం
  • 18వ ఫ్లోర్ ను కుక్కల కోసం కేటాయించిన అర్పిత
పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన క్లోజ్ ఫ్రెండ్ అర్పిత ముఖర్జీ ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఆసక్తికర అంశం వెల్లడైంది. సినీ నటిగా ఓ మోస్తరు పేరు తెచ్చుకున్న అర్పిత ముఖర్జీ కోల్ కతాలో సంపన్నులు నివసించే ప్రాంతంలో ఓ ఖరీదైన ఫ్లాట్ లో ఉంటోంది. 

ఆమె నివసించే అపార్ట్ మెంట్ లో 18వ ఫ్లోర్ యావత్తు కుక్కల కోసమే కేటాయించినట్టు వెల్లడైంది. ఆ ఫ్లోర్ లో అర్పిత, పార్థ ఛటర్జీల పెంపుడు కుక్కలను ఉంచారట. వాటిని ప్రతిరోజు అర్పిత బయట తిప్పేవారు. ఆ కుక్కల్లో చాలా ఖరీదైన జాతి కుక్కలు కూడా ఉన్నాయి. పార్థ ఛటర్జీ అప్పుడప్పుడు వాటిని చూసేందుకు వస్తుండేవారు. 

ఇప్పుడు, అర్పిత, పార్థ ఛటర్జీ ఇద్దరినీ ఈడీ అరెస్ట్ చేయడంతో, ఆ కుక్కలను ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సంరక్షిస్తున్నట్టు అపార్ట్ మెంట్ వాసులు చెబుతున్నారు. 18వ ఫ్లోర్ లో 5 నుంచి 9 వరకు కుక్కలు ఉంటాయని భావిస్తున్నట్టు వారు తెలిపారు.

 కాగా, ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అర్పిత ముఖర్జీ మొదట్లో మోడలింగ్ చేసేది. సినీ నటిగా ఎదగాలన్న పెద్ద కోరికతో ఆమె చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. పలు ఒడియా చిత్రాల్లోనూ నటించింది. కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. అయితే, 2011లో వచ్చిన 'హృదయ్ లేఖో నామ్' అనే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. 

అప్పటివరకు బాగానే ఉన్న అర్పిత... మంత్రి పార్థ ఛటర్జీతో పరిచయం అయ్యాక పూర్తిగా మారిపోయిందని సినీ ప్రముఖులు వెల్లడించారు. దీనిపై నిర్మాత గౌతమ్ సాహా మాట్లాడుతూ, కెరీర్ మొదట్లో ఆమెకు సాయపడినవాళ్లను ఎంతమాత్రం పట్టించుకోలేదని, వారితో మాట్లాడడమే మానేసిందని వెల్లడించారు. ఎప్పుడూ పెద్ద పార్టీలకు హాజరయ్యేదని, పార్థ ఛటర్జీతోనూ కనిపించిందని వెల్లడించారు. తాజాగా ఆమె పేరు స్కాంలో రావడం చూసి నివ్వెరపోయామని తెలిపారు.

ప్రస్తుతం బీజేపీలో ఉన్న దర్శకుడు సంఘమిత్ర చౌదరి స్పందిస్తూ, మొదట్లో అర్పిత ముఖర్జీకి కారు కూడా లేదని, తర్వాత ఓ సెకండ్ హ్యాండ్ కారులో తిరిగేదని వివరించారు. ప్రస్తుతం ఆమె ఆడి, మెర్సిడెస్ వంటి విలాసవంతమైన కార్లలో తిరుగుతోందని పేర్కొన్నారు.
Arpita Mukherjee
Partha Chatterjee
Dogs
Floor
ED
Teachers Recruitment Scam
West Bengal

More Telugu News