Kim Jong Un: కిమ్ మరో అణు పరీక్షకు సిద్ధమవుతున్నాడా...? ఈ వ్యాఖ్యలు అందుకేనా...?

  • కొరియా దేశాల మధ్య యుద్ధం ముగింపు వార్షికోత్సవం
  • ప్రసంగించిన ఉత్తర కొరియా అధినేత కిమ్
  • అమెరికా, దక్షిణ కొరియాల నుంచి ముప్పు ఉందని వెల్లడి
  • అణు ముప్పు ఉందని ఆందోళన
  • ఆత్మరక్షణ సమయం ఆసన్నమైందని వివరణ
Kim comments leads to another possible nuke test by Korean nation

కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా 2017 తర్వాత ఇప్పటిదాకా అణు పరీక్షకు పూనుకోలేదు. అయితే, కిమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఉత్తర కొరియా మరోసారి ప్రపంచానికి సవాల్ విసరనుందన్న భావన కలుగుతోంది. తమకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల నుంచి ముప్పు ఉందని, తాము ఆత్మరక్షణ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కిమ్ వ్యాఖ్యానించారు. తద్వారా మరోసారి అణు పరీక్షలు జరిపేందుకు ఉత్తర కొరియా సన్నద్ధమవుతోందంటూ పరోక్షంగా వెల్లడించారు. 

ఉత్తర కొరియాను అమెరికా ఒక బూచిలా చూపుతోందని, ఓవైపు తమ భద్రతకు ముప్పు కలిగేలా అమెరికా సైనిక విన్యాసాలు చేపడుతోందని, మరోవైపు ఉత్తర కొరియా సాధారణ సైనిక విన్యాసాలు చేపట్టినా రెచ్చగొట్టే చర్యలంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని కిమ్ మండిపడ్డారు. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. తన చర్యలను సమర్థించుకుంటూ, ఉత్తర కొరియాను వేలెత్తి చూపిస్తోందని కిమ్ అగ్రరాజ్యంపై విమర్శలు చేశారు. అణుముప్పు సహా ఎలాంటి సంక్షోభాన్నయినా ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 

ఉభయ కొరియా దేశాల మధ్య యుద్ధం ముగింపు 69వ వార్షికోత్సవం సందర్భంగా కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, కిమ్ వ్యాఖ్యలను అంతర్జాతీయ నిపుణులు విశ్లేషించారు. కిమ్ మరోసారి అణ్వస్త్ర పరీక్షకు సిద్ధమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని అంటున్నారు. దక్షిణ కొరియా నేతలలోనూ ఇవే అంచనాలు నెలకొన్నాయి.

More Telugu News