Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. ఇక ప్రతి శుక్రవారం జాబ్​ మేళా డే.. ప్రతి మంగళవారం ప్లేస్​ మెంట్​ డే

APSSDC releases its job calendar
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) శుభవార్త చెప్పింది. స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్‌ మేళాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్‌ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో సత్యనారాయణ తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, చైర్మన్‌ అజయ్‌రెడ్డితో కలిసి ఆయన జాబ్‌ మేళా క్యాలెండర్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రతి మంగళవారం ప్లేస్‌మెంట్‌ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు రాష్ట్రంలో స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా 262 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు  వెల్లడించారు. 

గడిచిన మూడేళ్లలో 14 లక్షల మందికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గం పరిధిలో స్కిల్‌హబ్స్‌ ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో 66 హబ్స్‌ను ఆగస్టు 15న అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక, ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  ఏపీ ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ అజయ్‌రెడ్డి వెల్లడించారు.
Go Back to Shorts
Andhra Pradesh
job calendar
apssdc
new jobs
job melas

More Telugu News