'రాష్ట్రపత్ని' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌధురి.. నిప్పులు చెరుగుతున్న బీజేపీ!

  • ముర్ముకు సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలన్న స్మృతి ఇరానీ 
  • రాజ్యాంగ పదవుల్లో మహిళలను కించ పరిచేందుకు సోనియా అవకాశం ఇచ్చారని మండిపాటు
  • రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ముర్మును టార్గెట్ చేస్తున్నారని విమర్శ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ద్రౌపది ముర్మును ఆయన 'రాష్ట్రపత్ని' అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముర్ముకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధిర్ రంజన్ చౌధురిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. 

దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మహిళను కించపరిచేందుకు కూడా తన పార్టీ నేతలకు సోనియాగాంధీ అవకాశం ఇచ్చారని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ...  ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి అని మండిపడ్డారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మహిళలను కించపరచడం కొనసాగుతూనే ఉందని అన్నారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ పార్లమెంటులోనే కాకుండా దేశంలోని వీధుల్లో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆమెను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని స్మృతి ఇరానీ అన్నారు. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా ఆమెపై దాడి ఆగలేదని మండిపడ్డారు.

Smriti Irani
BJP
Draupadi Murmu
President Of India
Sonia Gandhi
Adhir Ranjan Chowdhury
Rashtrapatni

More Telugu News