Monkeypox Virus: మంకీపాక్స్ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్​ పోర్టులో అలర్ట్

Delhi airports on alert for monkeypox case detected national capital
  • వైరస్ లక్షణాలు ఉన్న వాళ్లు ఆసుపత్రికి తరలింపు
  • దేశ రాజధానిలో వెలుగు చేసిన మంకీపాక్స్ కేసు 
  • కేరళలో ఇప్పటికే మూడు కేసుల గుర్తింపు
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ ఇప్పుడు మన దేశంలోనూ అలజడి రేపుతోంది. కేరళలో ఇప్పటికే మూడు మంకీ పాక్స్ కేసులు నమోదు కాగా ఢిల్లీలోనూ ఒక కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి వ్యాధి సోకినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి లోక్ నాయక్ జయప్రకాశ్ (ఎల్ఎన్ జేపీ) ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాంతో, దేశంలో నమోదైన మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. 

  ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అధికారులు అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వారిని ఎల్ఎన్ జేపీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అధిక జ్వరం, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు ఉన్న ప్రయాణికులను ఎల్ఎన్జేపీ హాస్పిటల్లోని ఐసోలేషన్ కు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 20 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అనుమానితుల నమానాలను పూణెలోని జాతీయ అంటువ్యాధుల పరిశోధన సంస్థకు పంపిస్తున్నారు. సంబంధిత రోగుల కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసి, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

  అలాగే, పలు రాష్ట్రాల్లోనూ మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న అనుమానితులను గుర్తించారు. వాళ్ల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు. ఇప్పటిదాకా నమోదైన మంకీ పాక్స్ కేసులతో పాటు లక్షణాలు ఉన్నవాళ్లంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్లే. దీంతో, మంకీ పాక్స్ వ్యాప్తిని అరికట్టడానికి పోర్టులు, విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు హెల్త్ స్ర్కీనింగ్ నిర్వహిస్తున్నారు.
Monkeypox Virus
New Delhi
airport

More Telugu News