Stanford study: 2100 నాటికి 100 కోట్లకు తగ్గిపోనున్న భారత్ జనాభా

  • స్టాన్ ఫోర్డ్ అధ్యయనం అంచనా
  • సంతానోత్పత్తి రేటు తగ్గడం వల్లేనన్న అధ్యయనం
  • 1.79 శాతం నుంచి 1.19 శాతానికి పరిమితం కావొచ్చని వెల్లడి
  • చైనా, అమెరికాలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయని ప్రకటన
India population may shrink by 41 crore by 2100

భారత్ జనాభా పరంగా ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే మన దేశ జనాభా 140 కోట్లను సమీపించింది. రానున్న సంవత్సరాల్లో ఇది ఇంకా పెరిగిపోయి జనాభా పరంగా భారత్ మొదటి స్థానాన్ని చేరుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. వీటికి విరుద్ధంగా.. భారత్ లో జనాభా తగ్గిపోతుందని స్టాన్ ఫోర్డ్ అధ్యయనం చెబుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. 


వచ్చే 78 సంవత్సరాల్లో భారత్ లో జనాభా 41 కోట్లు తగ్గిపోయి 100 కోట్లకు పరిమితం అవుతుందని స్టాన్ ఫోర్డ్ అధ్యయనం వెల్లడించింది. జనాభా అంతరించిపోవడం వల్ల విజ్ఞానం మరియు జీవన ప్రమాణాలు స్తుబ్దుగా ఉంటాయని పేర్కొంది. భారత్ లో ప్రతీ చదరపు కిలోమీటర్ కు 476 మంది జీవిస్తుండగా, చైనాలో ఇది 148గానే ఉంది. 2100 నాటికి భారత్ లో జనసాంద్రత చదరపు కిలోమీటర్ కు 335కు తగ్గుతుంది. 

భారత్ లోనే కాదు, చైనా, అమెరికాలోనూ జనాభా క్షీణత పరిస్థితులు ఉంటాయని స్టాన్ ఫోర్డ్ అధ్యయనం చెబుతోంది. 2100 నాటికి చైనా జనాభా 93 కోట్లు తగ్గిపోయి 49.4 కోట్లకు పరిమితం అవుతుంది. సంతానోత్పత్తి రేటు ఆధారంగా ఈ అంచనాలను స్టాన్ ఫోర్డ్ అధ్యయనం ప్రకటించింది. 

భారత్ లో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం ఒక మహిళకు సగటున 1.79 జననాలుగా ఉంటే, 2100 నాటికి 1.19కు తగ్గుతుంది. అంటే ఒక మహిళ సగటున ఒకరికే జన్మనివ్వనుంది. దేశాలు సుసంపన్నంగా మారితే సంతానోత్పత్తి రేటు తగ్గడం సహజమేనని ఈ అధ్యయనం పేర్కొంది. ఆఫ్రికా దేశాలు ఈ శతాబ్దం రెండో భాగంలో జనాభా వృద్ధికి ఇంజన్లుగా పనిచేయవచ్చని అంచనా వేసింది.

More Telugu News