Karnataka: కరెన్సీ నోట్ల విసిరివేతపై సిద్ధరామయ్యకు సారీ చెప్పిన కర్ణాటక మహిళ
- సిద్ధరామయ్య సొంత నియోజకవర్గంలోనే ఘటన
- ఘర్షణల్లో గాయపడ్డ బాధితులకు పరిహారం అందించిన సిద్ధరామయ్య
- పట్టణంలో శాంతి భద్రతలు పరిరక్షించాలన్న బాధిత కుటుంబ మహిళ
- సిద్ధరామయ్య అనుచరులు ఇచ్చిన రూ.2.5 లక్షల పరిహారం స్వీకరణ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇచ్చిన పరిహారం నోట్లను ఆయన కారుపైకి విసిరేసిన ఓ మహిళకు చెందిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సిద్ధరామయ్య ఇచ్చిన కరెన్సీ నోట్లను విసిరేసిన మహిళ తాజాగా సిద్ధరామయ్యకు క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా సిద్ధరామయ్య అనుచరులు అందించిన రూ.2.5 లక్షల పరిహారాన్ని ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
శుక్రవారం నాటి ఘటన వివరాల్లోకెళితే... బాగల్‌కోట్ జిల్లా పరిధిలోని సిద్ధరామయ్య సొంత నియోజకవర్గం బాదామీలోని కెరూర్‌లో చోటుచేసుకున్న ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో బాధితులను పరామర్శించేందుకు శుక్రవారం కెరూర్ వెళ్లిన సిద్ధరామయ్య.. నలుగురు బాధితులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించి తిరుగు ప్రయాణమయ్యారు. పట్టణంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాధిత కుటుంబానికి చెందిన ఓ మహిళ.. సిద్ధరామయ్య ఇచ్చిన కరెన్సీ నోట్లను ఆయన గార్డు వాహనంపైకి విసిరికొట్టారు.