ppf: పీపీఎఫ్ నుంచి రుణం పొందడం ఎలా?

  • మూడు, ఆరు సంవత్సరాల మధ్య తీసుకోవచ్చు
  • వడ్డీ రేటు పీపీఎఫ్ రేటుకు ఒక శాతం అదనం
  • 36 నెలల్లో తీర్చేయాల్సి ఉంటుంది
How to take loan against Public Provident Fund account

నేటి జీవనంలో అప్పు సర్వసాధారణమైపోయింది. 750కు పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణాలు చాలా సులభంగా లభిస్తున్నాయి. అయితే, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్ల భారం ఎక్కువ. 12 శాతానికి పైనే (రూపాయి వడ్డీ) చెల్లించుకోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు రుణాలపై మూడు రూపాయిల వరకు వడ్డీ పడుతుంది. కనుక బంగారంపై, జీవిత బీమా పాలసీలపై తక్కువ రేటుకు రుణాలు పొందొచ్చు. అలాగే, మరో మంచి రుణ మార్గం ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే దీనిపైనా రుణాన్ని పొందొచ్చు.

పీపీఎఫ్ 15 ఏళ్ల కాల వ్యవధితో కూడిన పెట్టుబడి పథకం. పెట్టుబడి మొదలు పెట్టిన మూడో ఆర్థిక సంవత్సరం నుంచి రుణానికి అర్హత ఉంటుంది. అది కూడా ఐదో ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. రుణానికి దరఖాస్తు చేసుకునే నాటికి, రెండేళ్ల ముందు వరకు జమ చేసిన మొత్తం బ్యాలన్స్ నుంచి 25 శాతాన్ని రుణంగా ఇస్తారు. 

ఉదాహరణకు 2022 జూలైలో రుణానికి దరఖాస్తు చేసుకుంటే, 2020 మార్చి 31 నాటికి ఉన్న బ్యాలన్స్ లో 25 శాతం రుణంగా లభిస్తుంది. ఎస్ బీఐ నిబంధనలను పరిశీలిస్తే.. మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఐదో ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు రుణాన్ని పొందొచ్చని తెలుస్తోంది. రుణంపై వడ్డీ రేటు.. పీపీఎఫ్ ఖాతాలో బ్యాలన్స్ పై ఇస్తున్న రేటు కంటే ఒక శాతం ఎక్కువ. ప్రస్తుతం పీపీఎఫ్ పై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. రుణం తీసుకుంటే 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించాలి. రుణం చెల్లించేంత వరకు ఈ రేటు అమలవుతుంది. రుణాన్ని 36 నెలల్లో తీర్చేయాలి. లేదంటే ఒక శాతం అదనపు రేటు స్థానంలో 6 శాతం రేటు పడుతుంది.

ఒకవేళ ఐదో ఆర్థిక సంవత్సరం ముగిసి పోయినా ఫర్వాలేదు. అప్పుడు రుణానికి బదులు, పీపీఎఫ్ నుంచి పాక్షికంగా వెనక్కి తీసుకోవచ్చు. విద్య, వైద్య అవసరాల కోసం అయితే బ్యాలన్స్ నుంచి 50 శాతం ఇస్తారు. ఆరో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత నుంచి ఏ అవసరం కోసం అయినా పాక్షిక ఉపసంహరణను అనుమతిస్తారు.

More Telugu News