PM Modi: ప్రధాని మోదీ నోట కాళికామాత ప్రస్తావన

  • భారతావనికి ఎల్లప్పుడూ కాళికామాత ఆశీస్సులు ఉంటాయని ప్రకటన
  • స్వామి ఆత్మస్థానంద శతాబ్ధి వేడుకల్లో ప్రధాని ప్రసంగం
  • టీఎంసీ నేతల లక్ష్యంగా బీజేపీ నేత మాలవీయ ట్వీట్
PM Modi says Maa Kaali  blessings are with India BJP fresh message to Mahua Mamata

‘కాళి’ పోస్టర్ తో హిందువుల మనోభావాలను నిర్మాత, దర్శకురాలు లీనా మణిమేఖలై గాయపరచగా.. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి కాళికామాత ప్రస్తావన వచ్చింది. కాళికా అమ్మవారి ఆశీస్సులు భారత్ కు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. స్వామి ఆత్మస్థానంద శతాబ్ది వేడుకలను ఉద్దేశించి ప్రధాని ఆదివారం ప్రసగించారు. రామకృష్ణ మఠం 15వ అధ్యక్షుడిగా స్వామి ఆత్మస్థానంద పనిచేశారు. 

‘‘స్వామి రామకృష్ణ పరమహంస ఓ సన్యాసి. స్వయంగా తన కళ్ల ముందు కాళికా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నారు. వివేకానందకు ఎంతో గుర్తింపు ఉన్నా, కాళి అమ్మవారి పట్ల భక్తి భావంతో చిన్న పిల్లాడిలా మారిపోయారు. అంతటి అచంచల విశ్వాసమే స్వామి ఆత్మస్థానందలోనూ ఉంది’’అని ప్రధాని మోదీ అన్నారు. బెంగాలీ ప్రజలు కాళికామాతను ఆరాధించడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. తద్వారా కాళికామాత పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న వారికి ప్రధాని పరోక్ష హెచ్చరిక పంపినట్టయింది. తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా సైతం అమ్మవారి ఆచారాలను తప్పుబట్టడం తెలిసిందే. 

ప్రధాని ప్రసంగం నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ.. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆ పార్టీ ఎంపీ మొయిత్రా లను లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘కాళి మాత భక్తి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. కేవలం బెంగాల్ ప్రజల కోసమే కాదు, మొత్తం భారతావని తరఫున మాట్లాడారు. కానీ, టీఎంసీ ఎంపీ (మొయిత్రా) కాళికామాతను అగౌరవ పరుస్తోంది. మమతా బెనర్జీ ఆమెపై చర్యలు తీసుకోవడానికి బదులు, సమర్థిస్తున్నారు’’అంటూ మాలవీయ ట్వీట్ చేశారు.

More Telugu News