Zomato: జొమాటో యూజర్ల నుంచి బాగానే పిండుకుంటోంది.. రుజువులు ఇవిగో అంటూ కస్టమర్ పోస్ట్!

  • రెస్టారెంట్ లో రేట్లు వేరు
  • జొమాటో, స్విగ్గీ రేట్లు వేరు
  • రెండింటి మధ్య వ్యత్యాసం 20-30 శాతం
  • బయటపెట్టిన ముంబై వాసి
  • ధరల్లో తమ పాత్ర ఉండదన్న జొమాటో
Zomato reacts to viral image revealing major price differences between offline and online food items

రెస్టారెంట్ కు వెళ్లి తిన్న తర్వాత చెల్లించే బిల్లుకు.. వాటినే జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుంటే చెల్లించే బిల్లుకు వ్యత్యాసం ఉంటోంది. ఈ విషయం తెలిసింది కొద్ది మందికే. దీనికి రుజువు ఏంటి? అని అడిగే వారికి ఓ కస్టమర్ లింక్డ్ ఇన్ లో పెట్టిన పోస్టే స్పష్టమైన నిదర్శనం. 

ముంబైకి చెందిన రాహుల్ కాబ్రా కాండీవలి ఈస్ట్ ప్రాంతానికి చెందిన 'ద మోమో ఫ్యాక్టరీ' అనే రెస్టారెంట్ నుంచి కావాల్సినవి తీసుకున్నాడు. బిల్లు చెల్లించాడు. జొమాటోలో వీటి ధరలు ఎలా ఉన్నాయి? అని చూశాడు. ఆశ్చర్యపోవడం అతడి వంతు అయింది. 

ఎందుకంటే, వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్ ధర నేరుగా వెళ్లి తీసుకుంటే పన్ను కాకుండా రూ.199. కానీ, జొమాటోలో దీని ధర పన్నులు కాకుండా రూ.269. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ధర నేరుగా తీసుకుంటే రూ.170. ఇదే జొమాటోలో రూ.245. మష్ రూమ్ మోమో ధర నేరుగా తీసుకుంటే రూ.119. జొమాటోలో రూ.179. వీటికి అతడు పన్నుల సహా రూ.512 చెల్లించాడు. కానీ, జొమాటోలో బిల్లు మాత్రం రూ.690.

సాధారణంగా స్విగ్గీ అయినా, జొమాటో అయినా రెస్టారెంట్ల నుంచి 20-30 శాతానికి పైనే కమీషన్ తీసుకుంటాయి. ఇది అంతర్గత వ్యాపార రహస్యం. ఇది బయటకు తెలియదు. స్విగ్గీ, జొమాటో డిస్కౌంట్స్ ఇచ్చినా కానీ, వాటికి లాభం వచ్చేంత వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తోంది. ఒక్కసారి ఆన్ లైన్ ఫుడ్ మార్కెట్ మెచ్యూర్ అయితే అప్పుడు ఈ డిస్కౌంట్స్ ను సంస్థలు ఆపేస్తాయి. అప్పుడు లాభాలే లాభాలు.

‘‘రెస్టారెంట్లకు జొమాటో మరింత ప్రాచుర్యం కల్పించి, మరిన్ని ఆర్డర్లు వచ్చేందుకు సాయం చేస్తుండొచ్చు. కానీ, దీనికి ఇంత అధికంగా చార్జ్ చేయాలా?’’ అని కాబ్రా ప్రశ్నించాడు. ధరలపై పరిమితులు ఉండాలని అభిప్రాయపడ్డాడు. దీనికి జొమాటో తెలివైన సమాధానం ఇచ్చింది. ‘‘కస్టమర్, రెస్టారెంట్ మధ్య జొమాటో మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తోంది. ప్లాట్ ఫామ్ పై ధరల్లో మా పాత్ర ఉండదు’’ అని ప్రకటించింది. నిజమే. కానీ జొమాటో, స్విగ్గీ కమీషన్ తీసుకుంటూ ఉండడంతో ఆ మేర వారు అధిక ధరలను నిర్ణయిస్తున్నారు. 

More Telugu News