Narendra Modi: పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలి.. హైదరాబాద్ వస్తున్న మోదీపై నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు

  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీ పర్యటన కోసం కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేస్తారన్న ప్రకాశ్ రాజ్
  • తెలంగాణలో ప్రజలు చెల్లించే పన్నులను వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని ట్వీట్
  • కొంతకాలంగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్
Prakash Raj satirical tweet over PM Modi hyderabad visit

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో అద్భుత పాలన నడస్తున్నది పరోక్షంగా చెప్పారు. మోదీ పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ వస్తున్నఅత్యుత్తమ నాయకుడిగా స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా చెప్పారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ పర్యటనల సమయంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తుంటారని, కానీ, తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. నీటి ప్రాజెక్టు, యాదాద్రి, టీ హబ్2, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తో 
కూడిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. 

కాగా, ప్రకాశ్ రాజ్ కొంత కాలంగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ‘జస్ట్ ఆస్కింగ్’ హ్యాష్ ట్యాగ్ తో కేంద్రం, బీజేపీపై తరచూ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. దక్షిణాది అన్ని భాషల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రకాశ్ రాజ్ తో సీఎం కేసీఆర్ కు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య ప్రకాశ్ రాజ్, ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తో సీఎం చర్చలు జరిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు, గజ్వెల్ లో వివిధ అభివృద్ధి పనులను ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రకాశ్ రాజ్ పరిశీలించారు. దాంతో, మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ను తెలంగాణ నుంచి రాజ్య సభకు నామినేట్ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి.

More Telugu News