WHO: 110 దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మహమ్మారి మార్పు చెందుతోంది: డబ్ల్యూహెచ్​ వో హెచ్చరిక

  • కరోనా వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదు
  • పరీక్షలు, కొత్త కేసుల నమోదు తగ్గిపోవడంతో సమస్య
  • కొత్త వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారిందని వెల్లడి
WHO says covid cases rising in 110 countries

ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని.. కరోనా వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. కరోనా మహమ్మారి మార్పు చెందుతోందని పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్వో అధిపతి టెడ్రోస్ వెల్లడించారు.

కొత్త వేరియంట్లను గుర్తించలేక..
“కరోనా మహమ్మారి ఇంకా ముగిసి పోలేదు. అది మరింతగా మార్పు చెందుతోంది. కరోనా పరీక్షలను తగ్గించివేయడం, కొత్త కేసుల నమోదు, ఏయే వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయన్నది తెలుసుకునే జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలను దేశాల ప్రభుత్వాలు తగ్గించి వేశాయి. దీనివల్ల వైరస్ వ్యాప్తిని తగిన విధంగా గుర్తించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించడం, భవిష్యత్తులో తలెత్తగల వేరియంట్లను విశ్లేషించడం కష్టంగా మారుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపుతుండటంతో కేసులు పెరుగుతున్నాయి..” అని టెడ్రోస్ పేర్కొన్నారు. 

టీకాల లక్ష్యం ఇంకా నెరవేరలేదు..
ప్రపంచవ్యాప్తంగా టీకాల లక్ష్యం ఇంకా నెరవేరలేదని, దీనివల్లే వైరస్ వ్యాప్తి గురించి ఆందోళన నెలకొందని టెడ్రోస్ తెలిపారు. అన్ని దేశాలూ కనీసం 70 శాతం మంది జనాభాకు టీకా వేయాలని సూచించినా.. అల్పాదాయ దేశాల్లో ఇంకా అర్హులకు టీకాలు అందలేదని పేర్కొన్నారు. 58 దేశాలు మాత్రమే 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని వివరించారు. పిల్లలు, గర్భిణులు, రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు ఇంకా ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.


More Telugu News